సినిమా ఇండస్ట్రీ అంటేనే నల్లేరు మీద నడక లాంటిది. ఓ సినిమా హిట్ అయిందంటే ఎనలేని సంపద వచ్చిపడుతుంది. ఫట్ అయితే కోట్లు పోగొట్టుకుని అప్పుల పాలవ్వడం ఖాయం. అంతే కాకుండా తీసిన ప్రతి సినిమా హిట్ అవదని అందరికీ తెలుసు. ఇది ఏ ఇండస్ట్రీలో నైనా ఒకటే.. ఇలాంటి సమయంలో నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు గొడవలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో వారు కేసులు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుంది.
ఈ మధ్య అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా ఎలాంటి రిజల్ట్ తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు అప్పుల పాలయ్యారు. వారిలో ఒకరైన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ కూడా భారీగా నష్టపోయారు. దీంతో ఏకే ఎంటర్టైన్మెంట్ వారు తమ దగ్గర రూ .30 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ ప్రెస్ మీట్లో తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి నట్టింట ముంచారని సత్యనారాయణ ఆరోపించారు. బత్తుల సత్యనారాయణ ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ ప్రెస్ నోట్లో ఏప్రిల్ లో ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూటర్ హక్కులను మూడు రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు తనకు చెందిన గాయత్రి దేవీ ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసుకొని రూ. 30కోట్లు మోసం చేశారని ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.
బ్యాంకు అకౌంట్ రూపంలో తన ఫ్రెండ్స్ ద్వారా రూ .30 కోట్లు ఏజెంట్ సినిమా మూడు రాష్ట్రాల హక్కుల కోసం చెల్లించానంటూ పక్కా ఆధారాలు చూపించాడు. సదరు నిర్మాణ సంస్థ విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ హక్కులు అందజేసి అగ్రిమెంట్ కు తూట్లు పొడిచారని పేర్కొన్నాడు. తర్వాత మే 1న హైదరాబాదులో వారి ఆఫీసుకు వెళ్లి నిర్మాతలతో మాట్లాడారు. మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్లినప్పుడు అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామన్నారట. దీంతో తనకు డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మకంతో వైజాగ్ కి వెళ్లిపోయాడట.
ఆ తర్వాత సామజవరగమన సినిమా హక్కులను వైజాగ్ వరకే ఇచ్చారట దీంతో వారి కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చి కాస్త కవర్ అయిందట. 45 రోజుల్లోగా ఏకే ఎంటర్టైన్మెంట్ వారు డబ్బు చెల్లించకుంటే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తామని హామీ పత్రం ఇచ్చారట. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా నటిస్తోన్న భోళా శంకర్ సినిమా విడుదల కాబోతోంది. ఈ విషయంలో జవాబివ్వకుండా దాటవేట చర్యలు చేస్తుండడంతోనే కోర్టు ఆశ్రయించాల్సి వస్తుందని బత్తుల సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో భోళా శంకర్ సినిమాకు రిలీజ్కు ముందే షాక్ తగిలినట్లయింది.