మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ సినిమాకు స్టైలిష్ ఫిలిం మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇక చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇక మహానటి కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలిగా నటించింది. ఇక ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఇక భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా.. మూవీ యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది. ఈ నేపథ్యంలోనే భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ శిల్ప కళావేదికలో జరిగింది. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంటులో చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

“అమ్మ ప్రేమ ఎప్పుడూ బోర్ కొట్టదు. అలాగే అభిమానుల కేరింతలు కూడా ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంటాయి. నా అభిమానులు గర్వపడేలా ఉండటం కోసమే నేను నా నడవడికను మార్చుకుంటూ ఈ స్థాయి వరకూ వచ్చాను అని అన్నారు. ఈ సినిమా చేసేటప్పుడు ఎప్పుడో వచ్చిన ‘వేదాళం’ రీమేక్ ఇప్పుడు చేయడం అవసరమా? అని చాలామంది అడిగారు. మంచి కంటెంట్ ఉన్నప్పుడు రీమేక్ చేయడం వలన తప్పేముంది? పైగా ‘వేదాళం’ సినిమా ఏ ఫ్లాట్ ఫామ్ పై లేదు. ఆ విషయంలో స్పష్టత వచ్చిన తరువాతనే ఈ రీమేక్ ను మొదలుపెట్టడం జరిగింది. ఈ కథ నాకు నచ్చడం వలన .. మెహర్ రమేశ్ టాలెంట్ పై నమ్మకంతో ఈ సినిమా చేయడం జరిగింది’’.

‘‘నేను చిన్న చిన్న వేషాలు వేస్తూ నా కెరియర్ ను మొదలుపెట్టాను. అలాంటి నేను ఈ రోజున ఈ స్థాయికి .. ఈ స్థానానికి చేరుకోవడానికి కారణం ప్రేక్షకులే. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన డబ్బుతోనే నిర్మాతలు సినిమాలు మొదలుపెట్టేవారు. ప్రేక్షకులు నాపై చూపుతున్న అభిమానం వాళ్లను ప్రభావితం చేసింది. దాంతో వాళ్లు నా పేరును నిర్మాతలకు సూచించేవారు. ‘చిరంజీవి అనే కొత్త కుర్రాడు డాన్సులు .. ఫైట్లు .. కామెడీ బాగా చేస్తున్నాడు, అతని సినిమాలను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు .. అతనితో సినిమాలు చేయండి’ అని నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవారు. అలా ప్రేక్షకులే నన్ను ఇక్కడి వరకూ తీసుకుని వచ్చారు. ఈ సినిమాలో నేను హుషారుగా చేయడానికి కారణం మీరిచ్చిన ఎనర్జీనే ” అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.