Baby : ఈమధ్య కాలం లో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తున్నాయి, భారీ హంగులు ఆర్భాటాలతో విడుదల అవుతున్న భారీ బడ్జెట్ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. అలాంటి సమయం లో చిన్న సినిమాలే థియేటర్స్ ని బ్రతికిస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ‘బేబీ’ అనే మరో చిన్న చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకుంది. అద్భుతమైన పాటలు, ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా విడుదలకు ముందే ఆకట్టుకున్న ఈ సినిమా, నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసిన స్పెషల్ ప్రీమియర్ షోస్ ద్వారా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందో లేదో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) మరియు వైష్ణవి ( వైష్ణవి చైతన్య) స్కూల్ డేస్ నుండి ప్రేమించుకుంటారు. ఆనంద్ ఇంట్లో ఉన్న ఆర్ధిక పరిస్థితుల కారణం గా స్కూల్ తోనే తన చదువుని ఆపేసి ఆటో డ్రైవర్ గా స్థిరపడిపోతాడు. కానీ వైష్ణవి మాత్రం పై చదువులు కోసం కాలేజీలో చేరుతుంది. కాలేజీ లో చేరిన తర్వాత అక్కడి వాతావరణం కి తగ్గట్టుగా వైష్ణవి లో చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. కాలేజీ లో విరాజ్(విరాజ్ అశ్విన్) అనే అతను పరిచయం అయ్యాక వైష్ణవి మరియు ఆనంద్ మధ్య గొడవలు రావడం మొదలు అవుతాయి. అలా సాగిపోతున్న ఈ ముగ్గురి జీవితం లో ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
డైరెక్టర్ సాయి రాజేష్ యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అని అనిపిస్తుంది. ప్రతీ సన్నివేశం కూడా మన నిజజీవితం లో ఎక్కడో జరిగిందే అని చూసే ప్రతీ ఒక్కరికీ అనిపిస్తుంది. ఆయన రాసిన డైలాగ్స్ చాలా బోల్డ్ గా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఈమధ్య కాలం లో కొంతమంది అమ్మాయిలు ఒకరిని ప్రేమిస్తున్నారు, ఒకరితో పడుకుంటున్నారు, చివరికి వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటున్నారు అనే పాయింట్ మీద, ప్రతీ ఒక్కరి మనసుల్ని కదిలించే విధంగా డైరెక్టర్ ఈ కథని రాసుకున్నాడు. ఎలా అయితే చూపించాలి అనుకున్నాడో , అలాగే వెండితెర మీద ఆవిష్కరించాడు. ఫస్ట్ మొత్తం యూత్ ఉర్రూతలూ ఊగిపోయ్యే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం ఈ చిత్రం లోని హైలైట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది కానీ, డైరెక్టర్ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా సినిమా పాయింట్ ని మాత్రమే పట్టుకొని స్క్రీన్ ప్లే నడిపించడం తో ఆడియన్స్ బోర్ కొట్టదు. చిన్న చిన్న ల్యాగ్స్ ని మినహాయిస్తే సెకండ్ హాఫ్ కూడా అదిరిపోయింది. ఇక క్లైమాక్స్ అయితే మన యూత్ కి చిరకాలం గుర్తుండిపోతుంది. అంత హార్డ్ హిట్టింగ్ గా క్లైమాక్స్ ఉంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, ముందుగా హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి మనం మాట్లాడుకోవాలి. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే ఈ అమ్మాయిలో ఇంత టాలెంట్ ఉందా అని ప్రతీ ఒక్కరు నోరెళ్లబెట్టేలాగా ఇందులో ఈమె నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఆనంద్ దేవరకొండ కూడా నటుడిగా ఒక మెట్టు ఎక్కేసాడు ఈ చిత్రం తో, విరాజ్ అశ్విన్ కూడా తన పరిధిమేర బాగా చేసాడు.ఇక ఈ చిత్రానికి విడుదలకు ముందే ఆ రేంజ్ హైప్ రావడానికి కారణం మ్యూజిక్. విజయ్ బుల్గానిన్ అనే నూతన సంగీత దర్శకుడు అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.
చివరి మాట :
యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం యూత్ ఒక రేంజ్ లో కనెక్ట్ అయిపోతారు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ పరంగా ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య , నాగబాబు, లిరీష,కుసుమ , సాత్విక్ ఆనంద్, బబ్లూ , సీతా, మౌనిక,కీర్తన తదితరులు
దర్శకత్వం : సాయి రాజేష్
నిర్మాత : SKN
సంగీతం : విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రాఫర్ : ఏం ఎన్ బాలిరెడ్డి
ఎడిటర్ : విప్లవ్ నైషాదం
రేటింగ్ : 3/5