Hema Malini : లెహ్రెన్కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, హేమ మాలిని తన నటుడు-భర్తతో తన సంబంధం గురించి మాట్లాడింది మరియు తాను ధర్మేంద్ర నుండి దూరంగా జీవిస్తున్నట్లు వెల్లడించారు.సీనియర్ నటుడు ధర్మేంద్రతో వివాహమైన తర్వాత కూడా తన ఇంట్లోనే నివసించడంపై అలనాటి నటి, ఒకప్పటి డ్రీమ్‌గర్ల్ హేమ మాలిని ఎట్టకేలకు స్పందించారు. ఆ విషయంలో తాను బాధపడటం లేదని చెప్పారు.
ప్రతి మహిళా భర్త, పిల్లలతో సంతోషంగా ఉండాలని ఆశపడుతుందని.. కాకపోతే కొన్నిసార్లు అనుకున్న విధంగా జరగదని ఆమె అన్నారు. ‘‘ఒక మహిళ పెళ్లైయ్యాక కూడా తన ఇంట్లో నివసిస్తే ఫెమినిజం అనొచ్చు. కాకపోతే, ఇలా ఉండాలని ఎవరూ కోరుకోరు. కొన్నిసార్లు అలా జరుగుతుంది. ఏం జరిగినా సరే నువ్వు అంగీకరించక తప్పదు. లేకపోతే, ఎవరికీ తమ జీవితాన్ని కొనసాగించాలని అనిపించదు. ప్రతి మహిళా.. తన భర్త, పిల్లలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటుంది. అది కొన్నిసార్లు దారి తప్పొచ్చు. ఈ విషయంలో నేను ఏమీ బాధపడటం లేదు. నా జీవితం పట్ల నేను సంతోషంగానే ఉన్నా. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వాళ్లను గౌరవంగా పెంచా. అన్ని విధాలుగా ఆయన (ధర్మేంద్ర) మాకు ఎప్పుడూ అండగానే ఉన్నారు. పిల్లల పెళ్లి విషయంలోనే ఆయన తరచూ కంగారుపడేవారు. సమయం వస్తే తప్పకుండా వాళ్ల పెళ్లిళ్లు జరుగుతాయని చెప్పేదాన్ని’’ అని ఆమె పేర్కొన్నారు. ఇక, ‘షోలే’, ‘సీత ఔర్ గీత’ తదితర చిత్రాల్లో హేమ-ధర్మేంద్ర కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 1980లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇషా, అహనా అనే కుమార్తెలు ఉన్నారు. అయితే, హేమ మాలిని ని వివాహం చేసుకోవడానికి ముందే ధర్మేంద్రకు ప్రకాశ్ కౌర్‌తో పెళ్లైంది.