తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ మారాజుగా ఎదిగారు కొణిదెల శివ శంకర వరప్రసాద్. ఈయనెవరు అని ఆలోచిస్తున్నారా.. ఆయనే నండి మన చిరు.. చిరంజీవి. మొదటగా ఇండస్ట్రీకి పరిచయమై.. తర్వాత ఎందరో ప్రతిభ గల హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పటి వరకు ఎంతో మందికి చేతనైనంత సాయం అందిస్తూనే ఉన్నారు. తన కెరీర్లో ఇప్పటివరకు 150 కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే చిరంజీవికి ‘మెగాస్టార్’ అనే బిరుదు ఎలా వచ్చింది అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అదే విషయాన్ని మనం తెలుసుకుందాం..

కే.ఎస్ రామారావు గారు.. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా వెలుగొందారు. ఆయనే చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం అభిలాష. ఈ సినిమా చాలా బంపర్ హిట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు ఐదు సినిమాలు వచ్చాయి. అందులో రాక్షసుడు, చాలెంజ్ వంటి సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. రాక్షసుడు సినిమాతోనే మెగాస్టార్ తమ్ముడు నాగబాబు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

అయితే చిరంజీవి, కె.ఎస్ రామారావు కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా మరణ మృదంగం. ఈ సినిమా సమయంలోనే చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదును జోడించి తెరపై ప్రదర్శించారు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేక పోయింది. కానీ చిరంజీవికి మాత్రం మెగాస్టార్ అనే బిరుదును తెచ్చి పెట్టింది. ఇక అప్పటినుంచి ప్రతీ సినిమాలో చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదు అలా నిలిచిపోయింది. పేరుతో కాకుండా బిరుదుతో ఆయన ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నారు.