నాగార్జున శివ సినిమాలో విలన్‌గా వెండితెరకు పరిచయమైన జేడీ ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. ఆతర్వాత పలు సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్పెషల్ రోల్స్‌తో మెప్పించాడు. త్వరలో జేడీ నటించిన దయ సినిమా డైరెక్టుగా ఓటీటీలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇందులో భాగంగా తనపై విషప్రయోగం జరిగిందంటూ సంచలన కామెంట్లు చేశాడు. ప్రస్తుతం జేడీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
‘కొన్ని నెలల క్రితం ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎందుకొచ్చాయో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకు డ్రగ్స్, సిగరెట్లు వంటి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అయినా బ్రీతింగ్ సమస్యలు రావడంతో చాలామంది వైద్యులను కలిశాను. నా స్నేహితుడు ఉత్తేజ్ సహాయంతో పలు దేశాల్లోని డాక్టర్లను కలిశాను. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. డాక్టర్లు బతకడం కష్టమే అని చేతులెత్తేశారు. ఇదే సమయంలో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా నిర్మాత శేషురెడ్డి నాకు అండగా నిలిచారు. అతను నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. లాయర్‌గా పలు సమస్యల నుంచి కాపాడాడు. నాగార్జున అనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన నాకు కొన్ని మెడికల్ టెస్టులు చేశారు. అప్పుడే తెలిసింది నాకు 8 నెలలుగా స్లో పాయిజన్ ఇస్తున్నారని. నేను నిత్యం తాగే కషాయంలో దీనిని కలుపుతున్నట్లు తెలిసింది. అయితే నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు గనుక నా శరీరం స్లో పాయిజన్‌ను తట్టుకుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు జేడీ చక్రవర్తి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అసలు విషయం ఎవరు ఇచ్చారో కూడా ఆయన చెప్పారు. ‘నేను ఎడిటింగ్ చేస్తున్న రోజుల్లో ఖాసిమ్ అనే ఫ్రెండ్ ప్రతిరోజూ నాతోనే ఉండేవాడు. వాడు నేను తాగే కషాయాన్ని చూసి డైలీ నువ్వు ఒక్కడివే తాగుతావా? నేను కూడా తాగుతానంటే ఇచ్చాను. ఆ తర్వాత రెండు మూడు రోజులు తను అనారోగ్యం పాలయ్యాడు. ఈ కషాయాన్ని రోజూ నాతో తాగిస్తున్న వ్యక్తికి ఖాసిమ్‌కు జరిగిన విషయం చెప్తే.. నీకోసం ప్రత్యేకంగా ఇచ్చిన కషాయాన్ని అతనికి ఎందుకు ఇచ్చావని పెద్ద గొడవ చేశాడు. ఆ విషయం అక్కడే వదిలేశాను. కానీ ఒకరోజు ఊపిరి ఆడటం లేదు. చచ్చిపోతానేమో అనుకున్నా. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ తను వాడే ఇన్‌హేలర్ ఇచ్చిది. దాంతో రిలీఫ్ దొరికింది. అదే విషయం డాక్టర్‌కు చెప్తే ఆ కషాయం రూపంలో ఇచ్చిన స్లో పాయిజన్ ఏంటో తెలిసింది’ అని వెల్లడించారు.