పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని టాలీవుడ్ నటి డింపుల్ హయతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టిన కేసును కొట్టివేయాలని నటి హైకోర్టును ఆశ్రయించారు. అధికారం ఉందని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఒత్తిడి చేయడంతో పోలీసులు తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో పేర్కొన్న డింపుల్ హయతి తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు.
డింపుల్ హయతి పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. డింపుల్ హయాతికి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు. పోలీసులు సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకు నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. ఆ నోటిసులకు అనుగుణంగా నటి డింపుల్ హయతి విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న లాయర్ విక్టర్ డేవిడ్‌కు కూడా 41ఏ నోటీసు ఇవ్వాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. సీఆర్పీసీ 41ఏ నోటీసులు అందుకున్న వారు చట్టాన్ని అనుసరించి విచారణకు హాజరు కావాలని హైకోర్టు సూచించింది.
మే 14వ తేదీన డింపుల్ హయతి తన కారుతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టగా.. తమ వాహనం ముందు భాగం దెబ్బతిన్నదని రాహుల్ హెగ్డే డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశయగా నటిపై కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు ఏమైనా చేయవచ్చు అనుకుంటున్నారని డింపుల్ హయతి తన సోషల్ మీడియా ఖాతాల్లో చేసిన పోస్టులు ఇటీవల వైరల్ గా మారాయి. అధికారంతో నిజాన్ని మార్చలేము అని మరో ట్వీట్ సైతం దుమారం రేపింది.