హరీష్ శంకర్.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వాగ్వాదాల స్టైల్ కూడా మారిపోయింది. ఏకంగా సోషల్ మీడియా వేదికగానే యుద్ధానికి దిగుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటివి కేవలం రాజకీయనాయకులకు మాత్రమే పరిమితంగా ఉండేది. అయితే తాజాగా సినీ ప్రముఖులు కూడా ఈ సోషల్ మీడియా వార్‌కు దిగుతున్నారు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు, ఓ ప్రముఖ వెబ్ సైట్ కు మధ్య జరిగిన ట్విట్టర్ వార్ చర్చనీయాంశంగా మారింది.
ఓ సినిమా చిత్ర యూనిట్ ఓ వెబ్ సైట్ ను ఉద్దేశిస్తూ.. సినిమా ఎంత నచ్చకున్నా మరీ ‘గార్బేజ్’ లాంటి పదాలు వాడాల్సిన అవసరముందా? అని ట్విట్టర్ వేదికగా తమ బాధను తెలియజేశారు. ఇదిలా ఉంటే, సదరు వెబ్‌సైట్ రివ్యూపై డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా స్పందిస్తూ.. అలాంటి పదాలు వాడిన ట్వీట్‌ను డిలీట్ చేయాల్సిందిగా సూచించాడు. కానీ ఆ వెబ్‌సైట్ రివ్యూయర్.. ‘ఇండస్ట్రీ పెద్ద’ అని హరీష్‌ను వ్యంగ్యంగా సంబోధించడమే కాక ఏవో లాజిక్స్ చెప్పి డిలీట్ చేయమని ఖరాకండిగా చెప్పేశాడు. మీతో పాటు మార్కెట్‌కి దూరంగా ఉన్న రిటైర్డ్ రివ్యూయర్స్ కొందరు మాత్రం మేం వాడిన పదాలను మాత్రమే తప్పుపడుతున్నారు. అది మంచిది కాదు. వెబ్ రివ్యూయర్స్ ఎవరైనా మీ చిత్రాల నుంచి ఏదైనా చెత్త సీన్‌ను తొలగిస్తారా? అదేవిధంగా మేము కూడా ఈ ట్వీట్‌ను తొలగించలేము. సారీ!’ అంటూ రిప్లయ్ ఇచ్చింది.
నిజానికి హరీష్ శంకర్ అంతకుముందు చేసిన ట్వీట్ విషయానికొస్తే.. ‘సార్.. భాష ముఖ్యం, అభిప్రాయం కాదు. మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు మీకు ఉంది. రేపు ప్రేక్షకులు మీ తుది తీర్పుతో ఏకీభవించవచ్చు. కానీ మీ భాషను సమర్థించేవారు ఎవరూ ఉండరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రత్యేకించి చిన్న సినిమాలను లక్ష్యంగా చేసుకోవడం అస్సలు ఆమోదయోగ్యం కాదు.. దయచేసి ఆ ట్వీట్ తొలగించండి’ అని పోస్ట్ చేశాడు. దీనిపైనే సదరు వెబ్‌సైట్ ఘాటుగా స్పందించింది.