కొంతమంది నటుల పేర్లు మనకి గుర్తు ఉండకపోవచ్చు కానీ, వాళ్ళ ముఖం చూస్తే మాత్రం వెంటనే గుర్తు పెట్టెస్తాము, అలాంటి నటులలో ఒకడు పొన్నాంబళం. ఈయన తమిళం లో ఒకప్పుడు బాగా పాపులర్ విలన్, అలానే తెలుగు లో కూడా ఆయన పలు సినిమాల్లో నటించాడు. ఇతగాడిని మనకి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘ముత్తు’ అనే చిత్రం ద్వారా పరిచయం.ఆ సినిమా టాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఆ తర్వాత చిరంజీవి , బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ ని సంపాదించాడు. అయితే ప్రస్తుతం ఆయన చేతిలో ఎలాంటి సినిమా లేదు. రీసెంట్ గానే రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాలతో చెలగాటం ఆడి సురక్షితంగా బయటపడ్డాడు.నిన్న మొన్నటి వరకు తమిళం లో ఇంటర్వ్యూస్ వరుసగా ఇస్తూ వచ్చిన పొన్నాంబళం, రీసెంట్ గా తెలుగు లో కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడం ప్రారంభించాడు.
ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన చేసిన సహాయం గురించి చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ప్రాణాపాయ స్థితి లో ఇక బ్రతకను ఏమో అని అనుకుంటున్న సమయం లో చివరి ప్రయత్నం గా చిరంజీవి గారికి కాల్ చేశాను అని, ఇలా నా రెండు కిడ్నీలు చెడిపోయాయి, అర్జెంటు గా ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్లు చెప్పిన విషయాన్నీ చిరంజీవి గారికి చెప్పాను. ఎదో ఒకటి లేదా రెండు లక్షలు సహాయం చేస్తాడని అనుకున్నాను కానీ, ఆయన నా హాస్పిటల్ కి అయ్యే ఖర్చులు మొత్తం ఉచితంగా అందించాడు.
సుమారుగా 50 లక్షల వరకు అయ్యింది, ఈరోజు నేను ఇలా బ్రతికి ఉన్నానంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ పొన్నాంబళం చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఆరోజుల్లో చిరంజీవి గారి ‘ఘరానా మొగుడు’ సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. అప్పట్లో నేను ఒక ఫైట్ కి లక్ష రూపాయిలు తీసుకునే వాడిని, రాఘవేంద్ర రావు గారిని కూడా అంతే డిమాండ్ చేశాను, ఈ విషయం ఆయన చిరంజీవి గారికి చెప్పారట, ఆయన వెంటనే రమ్మనండి చూద్దాం అని అన్నాడు. అలా మా ఇద్దరి తొలిపరిచయం అక్కడ జరిగింది అంటూ పొన్నాంబళం ఈ సందర్భంగా తెలిపాడు.