ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. పుష్ప చిత్రంలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రకు తనకు కనుక వచ్చి ఉంటే.. నటించేదాన్ని అని.. ఆ రోల్ తనకు బాగా సరిపోతుందని కూడా అన్నారు. అలాగే తనకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టమని.. ఎన్నో కామెంట్స్ పై ఆమె వివరణ ఇచ్చింది. తన వ్యాఖ్యలు కాస్త నెట్టింట వివాదంగా మారడంతో నటి ఐశ్వర్యా రాజేశ్ తాజాగా ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ సినిమాలో రష్మిక వర్క్ అద్భుతంగా ఉందని, తోటి నటీనటులపై తనకు అమితమైన గౌరవం ఉందని చెప్పారు. ఇదంతా కాదు ఆమెను నెట్టింట రష్మిక ఫ్యాన్స్ తిట్టేసరికి దెబ్బకు లైన్లోకి వచ్చి సారీ చెప్పిందని కొందరు అంటున్నారు.
‘‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, నా సినిమాలను ఆదరిస్తున్నందుకు సినీ ప్రియులందరికీ ధన్యవాదాలు. నన్నూ, నా వర్క్నూ అమితంగా ప్రేమించే అభిమానులు, ప్రేక్షకులు ఉన్నందుకు నేనెంతగానో సంతోషిస్తున్నా. ఇక, వర్క్ విషయానికి వస్తే.. ‘మీరు ఎలాంటి పాత్రలు పోషించడానికి ఇష్టపడతారు..?’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను ప్రశ్నించారు. దానికి నేను.. తెలుగు సినీ పరిశ్రమ అంటే నాకెంతో ఇష్టమని, మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పాను.
ఉదాహరణకు ‘పుష్ప’లోని శ్రీవల్లి పాత్ర నాకెంతో నచ్చిందని, అలాంటి పాత్రలు నాకు సూట్ అవుతాయని చెప్పాను. దురదృష్టవశాత్తు నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ సినిమాలో రష్మిక పెర్ఫార్మెన్స్ను నేను అవమానించేలా మాట్లాడినట్లు వార్తలు సృష్టించారు. ఆ సినిమాలో రష్మిక వర్క్ నుంచి నేను ప్రేరణ పొందాను. అలాగే, నాతోటి నటీనటులపై నాకు ఎంతో గౌరవం ఉంది. నా వ్యాఖ్యలకు హానికరమైన ఉద్దేశాలను రుద్ది వదంతులు సృష్టించడం మానండి’’ అని ఆమె వివరణ ఇచ్చారు.