Puli Meka Review : ప్రముఖ టాలీవుడ్ రచయితగా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఆయన రూపొందించిన వెబ్ సిరీస్ పులి మేక.. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ5 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించారు. సీనియర్ నటుడు సుమన్, రాజా , సిరి హనుమంతు కూడా ఈ వెబ్ సిరీస్ లో నటించారు. ఇది ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఇంతకీ పులి మేక వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ:
హైదరాబాద్ సిటీలో పోలీస్ ఆఫీసర్స్ వరుసగా హత్య చేయబడుతూ ఉంటారు. ఓ సీరియల్ కిల్లర్ వీళ్ళందర్నీ చంపుతూ ఉంటారని తెలుసుకుంటారు. పోలీస్ కమిషనర్ (సుమన్) ఈ సీరియల్ కిల్లర్ అంతు తేల్చడానికి.. వేరే చోట పని చేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి) ని హైదరాబాదుకి ట్రాన్స్ఫర్ చేసి ఈ కిల్లర్ ను పట్టుకోమని ఆదేశిస్తారు. తనకి ఓ ప్రత్యేకమైన టీం ను కూడా సెట్ చేసుకోమని చెబుతాడు. డిపార్ట్మెంట్ హెడ్ ప్రభాకర్ శర్మ (ఆది సాయికుమార్) ఈ వరుస హత్యలు ఎక్కడ జరుగుతున్నాయో.. ఆ ప్లేస్, అలాగే ఆ చనిపోయిన శవం నుంచి విలువైన సమాచారం సేకరించి ఈ పోలీస్ టీం కి అందిస్తూ సాయపడుతూ ఉంటాడు.
ప్రభాకర్ శర్మ నాన్న జ్యోతిష్యం చెబుతూ చాలా మంది పెద్ద వాళ్లకు పరిచయం ఉంటారు. ఇక కిరణ్ ప్రభ సీరియల్ కిల్లర్ నీ పట్టుకుందా.? పట్టుకుంటే అతడిని ఏ విధంగా పట్టుకోగలిగింది.? సీరియల్ కిల్లర్ అసలు పోలీసులను ఎందుకు టార్గెట్ చేశారు.? పల్లవి (సిరి) ఎవరు.? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది.? కరుణాకర్ శర్మ (రాజా) ఎవరు? అతనికి ఈ కథకి సంబంధం ఏంటి.? ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే..

వెండి తెరపై తీయలేని సినిమాలను ఓటీటీలో వెబ్ సిరీస్ గా తీస్తూ వారికి ప్రాణం పోస్తున్నారు దర్శక నిర్మాతలు. వీరికి తోడు సినీ తారాగణం తోడవుతుండడంతో ఓటీటీ కంటెంట్ లో కావలసినంత స్టఫ్ దొరుకుతుంది. దాంతో ఆడియన్స్ కి డిఫరెంట్ కంటెంట్ను అందిస్తున్నారు. ఇదే పంథాలో వచ్చిన కథ పులి మేక.. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చినప్పటికీ కోన స్టైల్ ఆఫ్ కమర్షియల్ యాంగిల్ మనకు కథలో కనిపిస్తుంది.
హంతకుడు ఎవరనే సందేహం రావడం.. దానికి ఉన్న ఫ్లాష్ బ్యాక్ అవన్నీ ఓ ఫార్మాట్లో కనిపిస్తాయి. అయితే తెగే వరకు ఎందుకు లాగటం అనుకున్నారో ఏమోగానీ.. సగంలోనే హంతకుడు ఎవరు అనే పాయింట్ ను రివిల్ చేసేస్తారు. మిగిలిన కథంతా కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మధ్యలో కథ కాస్త తేలినట్టుగా అనిపిస్తుంది. మరి కొన్ని సాగదీసే సన్నివేశాలు లాజిక్ మిస్ అయ్యే సీన్స్ కొన్ని ఉన్నాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా నటించింది. బోనాలు వేషంలో వేసే యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో లావణ్యను డిఫరెంట్ గా కొత్తగా చూపించగలిగారు డైరెక్టర్.. ఓటిటీ డెబ్యూ లావణ్య త్రిపాఠి ఆకట్టుకుంది. ఆది సాయికుమార్ తన పాత్రను ప్రేక్షకులను మెప్పించే లాగా ఎప్పటిలాగే అవలీలగా చేశారు. రాజా చెంబోలు పాత్రలో ట్విస్ట్ తో సహా కొన్ని పాత్రలో రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సిరి హనుమంత్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లో నటించింది. ఈ పాత్రలో సిరి తన నటనతో ఒదిగిపోయింది.
పులి మేక వెబ్ సిరీస్ లో అక్కడక్కడ కథాంశం కాస్త బోర్ కొట్టిన కానీ.. చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయినా.. ఆసక్తికరంగా ఉంటుంది. కచ్చితంగా చూడాలని అనిపించే ఇంప్రెషన్ ను మాత్రం కోన వెంకట్ క్రియేట్ చేయగలిగారు. ప్రేక్షకులని టీవీల ముందు కూర్చోబెట్టగలగే కథగా ఈ వెబ్ సిరీస్ ను తీసుకొచ్చారు అనడంలో సందేహం లేదు. లావణ్య త్రిపాఠి తన పాత్రలో అద్భుతంగా నటించింది. చివరిలో ట్విస్ట్ ఇచ్చి రెండో సీజన్ కోసం ఎదురు చూసేలాగా చేశారు.