Vithika Sheru: తెలుగు అమ్మాయి హీరోయిన్ వితికా షేరూ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె హీరో వరుణ్ సందేశ్ తో కొన్ని సినిమాలు చేసి అతడితో ప్రేమలో పడింది. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత తనకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. అటు భర్తకి కూడా హీరోగా ఛాన్సులు తగ్గడంతో ఇద్దరూ కలిసి బిగ్ బాస్ కి వెళ్లారు. నిజానికి వితికా ప్రేమించే రోజుల్లో అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో వంటి సినిమాలలో నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు సినిమాలతో మెప్పించింది. కెరీర్ లో ఎదుగుతున్నప్పుడే వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది. కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. ప్రస్తుతం వితికా, వరుణ్ సోషల్ మీడియా, యూట్యూబ్, పలు టీవీ షోలతో అలరిస్తున్నారు.
తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ కష్టాలను బహిర్గతం చేసింది. తనకు పదహారేళ్ల ఉన్నప్పుడే సినిమాల మీద ఇంట్రెస్ట్ హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశానంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతోంది. ఆమె మాట్లాడుతూ.. ‘12 ఏళ్ల నుంచి పలు సీరియల్స్, సినిమాలు చేశాను. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కూడా పని చేశాను. 16 ఏళ్ల వయసులో నన్ను కమిట్మెంట్ అడిగారు. శ్రీనగర్ కాలనీలో హీరోయిన్ పాత్ర కోసమని ఓ మూవీ ఆఫీస్ కి ఆడిషన్ కి వెళ్లాను. నా యాక్టింగ్ వాళ్లు అప్పుడు మెచ్చుకున్నారు.
ఆ సమయంతో మా అమ్మ కూడా నాతోనే ఉంది. సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నట్టు చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది. అయితే మీ అమ్మతో మాట్లాడాలని చెప్పి నన్ను బయటికి పంపించారు. తర్వాత అమ్మతో మీ అమ్మాయి మా సినిమాలో నటించాలంటే నిర్మాతతో కమిట్ అవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే అసలు కమిట్మెంట్ అంటే ఏంటో తెలియని మా అమ్మ అది అర్థం అవ్వక నన్ను లోపలికి రమ్మని పిలిచింది. తర్వాత ఏదో కమిట్మెంట్ ఇవ్వాలంటున్నారు చూడు.. అసలు ఏంటో కనుక్కో అని వాళ్ళ ముందే అంది. నాకు విషయం అర్థమై వెంటనే నో చెప్పి ఆమెతో పాటు బయటికి వచ్చేశాను. అయితే నేను ఎందుకు నో చెప్పాను అనేది మా అమ్మకి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం అనిపించింది’ అంటూ ఆమె ఎమోషనల్ అయింది.