Rithika Singh : విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది రితికా సింగ్. ఆ సినిమాలో కిక్ బాక్సర్ గా నటించింది. వాస్తవానికి ఆమె నిజ జీవితంలో కూడా కిక్ బాక్సరే. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. దీని తర్వాత నీవెవరో అనే సినిమాలో నటించగా అది ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. రితికా సింగ్ తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ నటించలేదు. అయితే తమిళ, హిందీ పరిశ్రమల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోటలో ఐటెం సాంగ్‌లో చివరిసారిగా కనిపించిన రితికా ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న వేటయ్య చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. దాంతో పాటు ఆమె వళరి అనే హారర్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ కార్యక్రమంలో సందడి చేసిన రితికా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇందులో భాగంగా ఓ విలేకరి ఆమెను ఇబ్బందికర ప్రశ్న అడిగారు. టాలీవుడ్‌లో చాలా మంది పరభాషా కథానాయకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. మీరు మాత్రం తెలుగులో ఎక్కువగా కనిపించడం లేదేం.. మీకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదా అంటూ ప్రశ్నించాడు.
దీనిపై రితికా స్పందించి ఘాటుగా సమాధానం ఇచ్చింది. నాకు నిజంగా నచ్చితే ఎలాంటి సినిమా అయినా చేస్తాను. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. నాకు మలయాళం, మరాఠీ, హిందీ తేడా లేదు. ఏ భాషలోనైనా నాకు కథ, పాత్ర ముఖ్యం. రెండు సెట్ అని అనుకుంటేనే సినిమాలకు ఒప్పుకుంటానని వివరించింది. ఇప్పుడు రితికా చేసిన వ్యాఖ్యలు నెట్‌లో వైరల్‌గా మారడంతో, ఆమె సరైన సమాధానం చెప్పిందని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.