Rana Naidu : వెంకటేశ్ (Venkatesh) హీరోగా శైలేశ్ కొలను సైంధవ్ తెరకెక్కించారు. జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ‘సైంధవ్’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ పాల్గొన్నారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘ఇది నా 75వ చిత్రం. మీ అందరి ప్రేమాభిమానాల వల్లే నా ప్రయాణం ఇక్కడి వరకూ వచ్చింది.

నా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ నుంచి ఇప్పటివరకూ మీడియా, సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్లందరూ నన్నెంతో ప్రోత్సహించారు. ఇప్పటివరకూ ఎలాంటి డల్ మూమెంట్ లేదు. జనవరి 13న ‘సైంధవ్’ విడుదల కానుంది. సంక్రాంతి సమయంలో రానున్న ఈసినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నా’’ అని వెంకటేశ్ అన్నారు. ‘‘ఏ నటుడికైనా మంచి కథ రావాలి. సీనియర్ నటుడు లేదా జూనియర్ యాక్టర్ అని కాదు. మంచి కథను సెలక్ట్ చేసుకుని అన్ని ఎలిమెంట్స్‌తో సినిమా చేస్తే తప్పకుండా ప్రేక్షకులకు రీచ్ అవుతారు. ఇకపై ఎక్కువగా పరిణతి చెందిన పాత్రల్లో నటిస్తా అందులో ఎలాంటి సందేహం లేదు.

అందుకే సైంధవ్ పాత్రను కూడా ఎంచుకున్నా. పెద్దోడు వస్తే సూపర్‌హిట్. చిన్నోడు వస్తే సూపర్‌హిట్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చూడలేదా. ప్రేక్షకులు మా సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. పండక్కి మా ఇద్దరి సినిమాలు విడుదల కావడం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ఇక ‘రానా నాయుడు’ గురించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆ సిరీస్ ఎంతోమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు నన్ను నాగా నాయుడు అనే పిలుస్తున్నారు. అది నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌కు వెళ్లినప్పుడు కూడా అదే జరిగింది. ‘రానా నాయుడు’ హిందీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో ఆ కంటెంట్‌ను చాలా వరకూ తగ్గించాం. భవిష్యత్తులో ఇంకా తగ్గిస్తాం.