సినీ ఇండస్ట్రీలోకి రావాలనేది చాలా మంది కల. ఆ కల కోసం ఎంతో మంది అహోరాత్రులు కష్టపడుతుంటారు. మండుటెండలో.. ఎముకలు కొరికే చలిలో.. బీభత్సమైన వానలో ఇలా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్మాతల ఆఫీసుల చుట్టూ కాళ్లకున్న చెప్పులరిగేలా తిరుగుతుంటారు. ఇలా ఏళ్ల తరబడి కష్టపడి ఒక్క ఛాన్స్ అంటూ తిరిగితే.. చివరకు ఓ రోజు ఆ ఛాన్స్ తలుపుతడుతుంది. ఇక ముందు ముందు ఉందిలే మంచికాలం అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుని ఒక పూట తింటూ మరో పూట పస్తులు ఉంటూ.. చిన్న చిన్న ఛాన్స్‌లను కూడా వదలకుండా పనిచేస్తుంటారు.
అలా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఓ నటి తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఓ నిర్మాత తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఆమె మరెవరో కాదు.. నటి లిరీష. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ వకీల్‌సాబ్ సూపర్ విమెన్ అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. అదేనండి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో లేడీ పోలీస్ పాత్రలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో సూపర్ ఉమెన్‌గా ఆమె పాత్ర థియేటర్స్‌లో ఈలలు వేయించింది.
తాజాగా లిరీష ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు. తనను చాలా మంది లావుగా ఉన్నావు అంటూ బాడీ షేమింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నిర్మాతలు సినిమాలు విడుదలైన తరువాత కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని బాధపడ్డారు.
“నాకు చాలా వరకు నెగటివ్ పాత్రలలో నటించడం ఇష్టం. ముఖ్యంగా తమిళ భాషతో పాటు ఇతర భాషలలో కూడా నటించడం ఇష్టమే కానీ అవకాశాలు రావడం లేదు. నాకు పలు సీరియల్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు వచ్చింది. చాలా మంది నన్ను లావు ఉన్నావు అంటారు. ఇప్పుడు నేను సన్నగా మారిపోతే హీరోయిన్గా ఏమైన ఛాన్స్ ఇస్తారా? నాకు ఇలా ఉండటమే ఇష్టం. నాకు లేని బాధ వారికి ఎందుకో అర్ధం కావటంలేదు. అలానే అందరు ఎదుర్కొన్నట్లు నేను డబ్బుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ‘తప్ప సముద్రం’ అనే సినిమాకు రెమ్యూనరేషన్ ఇప్పటికీ రాలేదు. ఆ నిర్మాతకు ఎన్ని సార్లు ఫోన్ చేసిన.. స్పందనే ఉండదు. చివరకు నేనే వదిలేశా. ఇలా కొన్ని సినిమాల్లో సగం రెమ్యూనరేషనే వస్తుంది. ఇక్కడ ప్రొడక్షన్ పెద్దది, మంచిదే అయినప్పటికి మధ్యలో జరిగే కొన్నిటి వలన డబ్బులు మా వరకు రావటంలేదు. చాలా వరకు అలానే జరుగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ సినిమాలో 40 రోజులు నటించాను. అయితే నా సీన్స్ కనిపించవు. అప్పుడు కూడా సగం డబ్బులు రాలేదు. అలా కొన్ని సినిమాలతో పాటు సీరియల్స్‌లో కూడా చాలా డబ్బులు వదులుకున్నాను” అని లిరీష చెప్పారు.