Kovi Sarala : సీనియర్ నటి కోవై సరళ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశముదురు సినిమాలో ఆవకాయ గురించి చెప్పి అందరి నోళ్లలో నీళ్లూరేలా చేసింది కోవై సరళ. అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించ గల సత్తా కలిగిన మహిళా కమెడియన్. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె.. ఇప్పుడు అడప దడప మాత్రమే సినిమాల్లో కనిపిస్తుంది. ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ సమయంలో తన మనసులోని మాటని బయటపెట్టింది. ముఖ్యంగా 62 ఏళ్ల వయసుకు వచ్చిన ఈమె ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే గతంలోనే తాను ఒకరిని ప్రేమించినట్లు తెలిపింది. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవాలని ఉంది చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.
తాజాగా కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ షోకు వచ్చింది. వస్తూ రావడమే.. అలినీ చూసి తెగ సంబురపడిపోయింది. నీ అక్కకు పట్టుచీర తెచ్చావు, మీ అమ్మకు తెచ్చావు.. నాకు మాత్రం ఇంకా చీర కొనివ్వలేదంటూ సెటైరికల్ కామెంట్స్ చేసింది. అప్పటి వరకు చున్నీతో మొహం దాచుకున్న ఆమె ఆ డైలాగ్ చెప్పగానే తెరిచి.. అలీకి సర్ ప్రైజ్ ఇచ్చింది. అలాగే ఆవకాయ డైలాగ్ కూడా చెప్పింది. ఆ తర్వాత వెల్ కామ్ చెప్పి మాట్లాడిన అలీ ఇప్పటి వరకు నీవు ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగాడు. తనకు ఇష్టం లేదని.. అయినా పెళ్లి చేసుకుంటేనే జీవించాలనేమైనా రూల్ ఉందా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. దాంతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘మా సొంత ఊరు కోయంబత్తూర్. కోయంబత్తూర్ ని షార్ట్‌గా కోవై అని అంటారు. మా ఊరిపేరే నాకు ఇంటి పేరుగా మారిందని.. అందుకే నన్ను కోవై సరళ అని పిలిచేవారు’ అంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలలో పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని చేసుకుంటావని ప్రశ్నించగా.. ఆలోచించకుండా అల్లు అర్జున్ ను చేసుకుంటానని మనసులో మాట బయటపెట్టింది. చిన్నప్పుడు తన పేరెంట్స్ ఎంతో కష్టపడ్డారని.. తండ్రి డప్పు కొట్టి డబ్బులు సంపాదించేవారని చెప్పింది. కళామతల్లికి తన జీవితాన్ని అంకితం చేసినట్లు వివరించింది. కాగా, ప్రస్తుతం సౌత్ లోని పలు తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటిస్తున్నట్లు కోవై సరళ తెలిపింది.