Tiger Nageswarao : ‘టైగర్ నాగేశ్వరరావు’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ఇందులో పాల్గొన్న దర్శకుడు వంశీ భావోద్వేగానికి గురయ్యారు. భవిష్యత్తులో తాను గొప్ప చిత్రాలు తెరకెక్కిస్తానని రవితేజకు మాటిచ్చారు. ‘‘నా కెరీర్‌లో ఇదే పెద్ద సినిమా. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని వివరిస్తూ వాళ్లు తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమా విషయంలో నన్నెంతో నమ్మి.. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిత్ర నిర్మాతలు, నటీనటులకు ప్రత్యేక ధన్యవాదాలు. రవి సర్.. ఈ ప్రయాణం ఇంతటితో ఆగిపోలేదు.

స్క్రిప్ట్ పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నప్పుడు మీరే నాకు ఈ ప్లాట్‌ఫామ్ ఇచ్చారు. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నా. వీడు నావాడు అని మీరు గర్వించేలా సినిమాలు చేస్తా’’ అని వంశీ అన్నారు. అనంతరం రవితేజ మాట్లాడుతూ.. చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించి వర్క్ చేశారని అన్నారు. ‘‘దర్శకుడు వంశీ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి వర్క్ చేశాడు. అతడు ఇంత చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగలడని అస్సలు ఊహించలేదు. అతడు మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. మా ఇద్దరి కాంబోలో మరెన్నో చిత్రాలు రావాలని నేను కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏమిటంటే.. విక్రమ్ రాథోడ్ పాత్ర తర్వాత నాకు విపరీతమైన సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇదే’’ అని రవితేజ తెలిపారు.

స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రవితేజ ప్రధాన పాత్రలో నటించారు. వంశీ దర్శకుడు. ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, జిషుసేన్ గుప్త, మురళీ శర్మ, గాయత్రీ భరద్వాజ్, నాజర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 3.02 గంటల నిడివితో ఈ సినిమా సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే.