Tollywood Movies మన టాలీవుడ్ లో దేశం గర్వపడే రేంజ్ సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో టాలీవుడ్ పరువుని తీసే చెత్త సినిమాలు కూడా ఉన్నాయి. ఫ్లాప్ సినిమాలకు నష్టాలు రావడం సర్వసాధారణం. కానీ ఎంత పెద్ద ఫ్లాప్ అయినా కూడా కనీసం 50 శాతం రికవరీ అవ్వాలి. కానీ కొన్ని చిత్రాలు 50 శాతం కంటే తక్కువ రికవరీ చేసాయి. అలాంటి 5 గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాం.
1) డబుల్ ఇస్మార్ట్:
పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని, ఘోరమైన వసూళ్లను రాబట్టింది. 45 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం 10 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేక, 20 శాతం రికవరీ మాత్రమే సాధించింది. టాలీవుడ్ లో అత్యంత భయంకరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఈ చిత్రం మొదటి స్థానం లో నిల్చింది.
2) ఎన్టీఆర్ కథానాయకుడు:
మహానటుడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశం మొత్తానికి చాటి చెప్పిన ఘనుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని, నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం కేవలం 28 శాతం మాత్రమే రికవరీ చేసింది.
3) లైగర్:
పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పూరీ జగన్నాథ్ కెరీర్ లో అతి చెత్త సినిమా అనే టాక్ ఈ చిత్రానికి వచ్చింది. ఓపెనింగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చినప్పటికీ, బిజినెస్ భారీ గా జరగడం వల్ల కేవలం 30 శాతం మాత్రమే రికవరీ చేసింది. పూరీ జగన్నాథ్ ఈ చిత్రం కారణంగా ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను కూడా ఎదురుకున్నాడు.
4) భోళా శంకర్ :
మెగా ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఒక పీడకల. చిరంజీవి కెరీర్ లో గతం లో ఎన్నడూ కూడా ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాని చూడలేదు, భవిష్యత్తులో ప్లాన్ చేసుకొని తీసినా కూడా ఇలాంటి డిజాస్టర్ రాదు. కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయిన ఈ సినిమా, 33 శాతం మాత్రమే రికవరీ చేసింది.
5) రాధే శ్యామ్ :
ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా ఈ చిత్రం ఒక పీడకలే. యాక్షన్ హీరో గా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ప్రభాస్ దున్నేస్తున్న సమయం లో ఇలాంటి సున్నితమైన ప్రేమకథ ని ఆడియన్స్ తీసుకోలేకపోయారు. ఫలితంగా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ, టాక్ లేకపోవడం తో లాంగ్ రన్ భారీ గా దెబ్బతినింది. ఫలితంగా ఈ చిత్రం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ చేసింది.