మన టాలీవుడ్ ఇప్పుడు సముద్రం మీద వందల కోట్ల రూపాయిల పెట్టుబడి పెడుతుంది. సముద్రం మీద వందల కోట్లు పెట్టడం ఏంటయ్యా, అసలు ఏమి మాట్లాడుతున్నావ్ అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు పాయింట్ కి వచేస్తున్నాం,ఈ ఏడాది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలన్నీ సముద్రం బ్యాక్ డ్రాప్ మీద తెరకెక్కినవే. గత ఏడాది కాకి మహత్యం టాలీవుడ్ మీద ఎంత పని చేసిందో, ఈ ఏడాది సముద్రం అలా టాలీవుడ్ కి సెంటిమెంట్ గా మారబోతుంది అని చెప్పొచ్చు.
గత ఏడాది ప్రారంభం లో సముద్రం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనం మర్చిపోలేం. ఈ సినిమా తర్వాత ఆ ఏడాది సముద్రం బ్యాక్ డ్రాప్ సినిమాలు విడుదల అవ్వలేదు కానీ, ఆ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్స్ మాత్రం మొదలయ్యాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. రీసెంట్ గా విడుదలైన పోస్టర్స్ అన్నీ కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ తో ఉన్నవే. ఇక రేపు విడుదలయ్యే టీజర్ కట్ లో సముద్రం బ్యాక్ డ్రాప్ ని ఏ రేంజ్ లో కొరటాల శివ ఉపయోగించుకున్నాడో అందరికీ అర్థం అవుతాది. ఈ సినిమాకి దాదాపుగా 250 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు.
ఇక అక్కినేని నాగచైతన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ‘తండేల్’ మూవీ కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నదే. నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి దాదాపుగా 150 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నాడు నిర్మాత అల్లు అరవింద్. అలా సముద్రం మీద ఈ ఏడాది దాదాపుగా 400 కోట్ల రూపాయిల బడ్జెట్ ని పెట్టి తీస్తున్నారు మన స్టార్ హీరోలు, ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి మరి.