ప్రజా గొంతు మూగబోయింది. వేల గొంతులను తన పాటలతో నిద్రలేపిన గొంతు ఇకపై వినిపించదు. ప్రతి క్షణం ప్రజల కోసమే పాటలు పాడిన ఆ స్వరం కనుమరుగైంది. దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల గొంతుకై వినిపించి.. ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్ ఇక లేరు. గద్దర్ మాజీ నక్సలైట్ అని, ఆయనో రాజకీయ నాయకుడు, సినీ నటుడు అని చాలా మందికి తెలియదు. నటుడిగా ఆయన వెండితెరపై నటించి ఆడిపాడారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ.. ఆయన నటించిన సినిమాలను ఓ సారి గుర్తు చేసుకుందాం..
1984లో ‘రంగుల కల’ అనే సినిమాలో గద్దర్ తొలిసారి నటించారు. ఈ సినిమాలో యాదగిరి పాత్రలో ఆయన మొదటిసారి నటించారు. ఈ సినిమాలోని ‘బండెనక బండి కట్టి’ పాట ఆయనే రాసి ఆడి పాడారు. ఆ తర్వాత 1971లో ‘ఆపరా రిక్షా’ పాట పాడారు. ఆయన ఫస్ట్ ఆల్బం పేరు ‘గద్దర్’. ఈ ఆల్బం క్యాసెట్లు మార్కెట్లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఆయన పేరు గద్దర్‌గా మారిపోయింది. ‘ఒరేయ్ రిక్షా’ సినిమాలో ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ పాట ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో చెప్పనవసరం లేదు. నేటికీ ఆ పాట జనాల నోళ్లలో నానుతూనే ఉంది. ఈ పాటకు నంది అవార్డు రాగా ఆయన దానిని తిరస్కరించారు. జైబోలో తెలంగాణ సినిమాలో ‘పొడుస్తున్న పొద్దు మీద’ పాటకు థియేటర్లు దద్దరిల్లాయి. ఈ పాటకు నంది అవార్డు సైతం వచ్చింది.
అలాగే ఆయన రాసి పాడిన ‘అమ్మా తెలంగాణ ఆకలికేకల గానమా’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర సర్కార్ ఎంపిక చేసింది. 2016లో దండకారణ్యం మువీ, 2022లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘గాడ్ ఫాదర్’ లో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు. గద్దర్ చివరిసారిగా ‘ఉక్కు సత్యాగ్రాహం’ అనే సినిమాలో కనిపించారు. గద్దర్ పాటల్లో ‘బండెనక బండి కట్టి’, ‘మల్లె తీగకు’, ‘పొడుస్తున్న పొద్దుమీద’ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎందుకంటే ఇవన్నీ సూపర్‌హిట్స్. వీటితోపాటు గద్దర్ చాలా పాటలు ఆలపించారు. ఈ సాంగ్స్ ప్రతిదానిలోనూ ఉండే సాహిత్యం.. సామాన్యుడికి అర్థమవుతూనే, మంచి ఊపు తీసుకొచ్చేలా ఉంటుంది. అందుకే ఎన్నేళ్లయినా సరే గద్దర్ పాటలు బోర్ కొట్టవు. అవి మన నుంచి దూరం కావు. గద్దర్ పాడిన వాటిలో ‘బండెనక బండి కట్టి..’ అనే పాట చాలా స్పెషల్. ఎందుకంటే 1979లో అంటే దాదాపు అండర్ గ్రౌండ్ కి వెళ్లడానికి కొన్నాళ్లు ఉందనగా ఈ పాట పాడారు. ‘మా భూమి’ సినిమలోని ఈ సాంగ్.. అప్పట్లో ఓ ఊపు ఊపేసింది.