‘Sandeep Reddy Vanga : యానిమల్’తో దర్శకుడిగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు సందీప్ రెడ్డి వంగా. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలై ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సందీప్‌రెడ్డి వంగాకు ఫిల్మ్ మేకింగ్‌పై ఉన్న ఆసక్తి గురించి ‘యానిమల్’ నటుడు సిద్ధాంత్ కర్నిక్ వెల్లడించారు. సందీప్‌కు సాయం చేసేందుకు ఆయన కుటుంబం పూర్వీకుల ఆస్తిని కూడా విక్రయించిందని చెప్పారు. ‘‘యానిమల్’ షూట్ వల్ల సందీప్ రెడ్డి వంగా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. సందీప్ సోదరుడు ప్రణయ్ నాతో చాలా విషయాలు పంచుకున్నారు.

అసిస్టెంట్ దర్శకుడిగా సందీప్ ఫిల్మ్ కెరీర్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, దర్శకుడిగా నిరూపించుకునేందుకు ఆయనకు ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో స్నేహితులతో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమా చేయాలనుకున్నారు. మరో నెల రోజుల్లో తన తొలి చిత్రం మొదలు కానుందనగా.. డబ్బులిస్తానన్నవారు చేతులెత్తేశారు. విషయం తెలుసుకున్న సందీప్ కుటుంబం ఆయనకు సపోర్ట్ చేసేందుకు ఊర్లో ఉన్న 36 ఎకరాల మామిడి తోటను విక్రయించింది. ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి సందీప్ తొలి చిత్రం తెరకెక్కించారు. ప్రణయ్ ఈ విషయం చెప్పినప్పుడు నేను షాకయ్యా. సినిమా కోసం ఎవరూ అంతటి సాహసం చేయరు’’ అని ఆయన తెలిపారు.

అయితే, ఇదే విషయాన్ని గతంలో సందీప్‌రెడ్డి వంగా సైతం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘యానిమల్’తో రష్మిక తో పోలిస్తే త్రిప్తి డిమ్రికి ఎక్కువ పాపులారిటీ వచ్చిందన్న ప్రచారంపై సిద్ధాంత్ మాట్లాడారు. ‘‘నాకు తెలిసినంత వరకూ నటీనటులందరికీ మంచి గుర్తింపు లభించింది. ఒకే ప్రాజెక్ట్‌లో వర్క్ చేసిన వారి మధ్య కూడా పాపులారిటీ విషయంలో పోటీ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నారు. అలాగే ప్రశంసలను ఎలాగైతే స్వీకరిస్తున్నామో అదే విధంగా విమర్శలను సైతం అంగీకరించాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.