Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొంత కాలంగా మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యునో వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ట్రీట్మెంట్ కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన సామ్.. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి విషయాలను అభిమానులతో పంచుకుంటోంది.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సమంత హాస్పిటల్ లో బెడ్ మీద పడుకొని చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటోని గురువారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేసింది. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇమ్యూనిటీ బూస్టర్ సహాయం పొందుతున్నట్లు చెబుతూ.. దాని వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించిన వివరాలను పంచుకుంది.

తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందని, ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ మెరుగవుతుందని, కండరాల శక్తివంతంగా అవుతాయని, ఎముకలు బలాన్ని పెంచుకోవచ్చని, గుండెకు సంబంధించిన వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని, వైరస్ లతో పోరాడుతుందని సామ్ రాసుకొచ్చింది. ఇంట్రావీనస్ న్యూట్రిషన్ అనేది ప్రధానంగా పోషకాహార లోపాలను పరిష్కరించడానికి ఇవ్వబడుతుందని, కొన్ని వైద్య పరిస్థితులకు రోగ లక్షణ ఉపశమనాన్ని అందిస్తుందని సమంత పేర్కొంది.