నటీనటులు : శ్రీ విష్ణు. రెబ్బ మౌనిక జాన్, వెన్నెల కిషోర్, నరేష్ , రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ తదితరులు
సంగీతం : గోపి సుందర్
దర్శకత్వం : రామ్ అబ్బరాజు .
కొత్త తరహా సినిమాలు చేస్తూ యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్న హీరో శ్రీ విష్ణు. కెరీర్ ప్రారంభం లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ ద్వారానే ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత హీరో అయ్యాక డిఫరెంట్ తరహా కథలను ఎంచుకుంటూ, ఈ కుర్రాడు కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు కానీ , లక్ కలిసి రావడం లేదనే ఫీలింగ్ అందరిలో కలిగేలా చేసాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ మరియు ‘రాజ రాజా చోర’ వంటి సినిమాలు మాత్రమే కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి.
అయ్యినప్పటికీ కూడా ఆయన తానూ ఎంచుకున్న విభిన్నమైన మార్గాన్ని వదులుకోలేదు,మొదటి నుండి ఎలాంటి తరహా సినిమాలు చేస్తూ వచ్చాడో, మొన్నటి వరకు అదే తరహా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘సామజవరగమనా’ అనే సినిమాతో మన ముందుకి వచ్చాడు. నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
ఒక మల్టిప్లెక్స్ లో పనిచేసే సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. కుటుంబ బాధ్యతలు మొత్తం తానే మోస్తుంటాడు కాబట్టి, ఖర్చు విషయం చాలా పొదుపుగా ఉంటాడు. అయితే తన తండ్రిని(నరేష్) డిగ్రీ పూర్తి చేయిస్తే తాత ఆస్తి మొత్తం దక్కుతుంది అనే విషయం తెలుసుకున్న బాలు, తన తండ్రిని ఎలా అయినా డిగ్రీ పూర్తి చేయించడానికి నానా తంటాలు పడుతుంటాడు. అప్పుడే సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న సరయు(రెబ్బ మౌనిక జాన్) పరిచయం అవుతుంది.
తన తండ్రి డిగ్రీ పూర్తి చెయ్యడానికి ఈమె సహాయ పడుతుంది అని ఆమెని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాడు. ఈ క్రమం లో ప్రేమంటేనే ఇష్టం లేని బాలు ని ప్రేమిస్తుంది సరయు, బాలు మొదట్లో ఒప్పుకోకపోయినా, తర్వాత ఆమె ప్రేమలో పడుతాడు. అలా సాగిపోతుండగా సరయు కి సంబంధించి ఒక చేదు నిజం బాలు కి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది?, బాలు సరయు ని పెళ్లి చేసుకుంటాడా?, తన డ్రిని డిగ్రీ పాస్ చేయించి ఆస్తిని తాత దగ్గర నుండి తీసుకుంటాడా అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
సింపుల్ పాయింట్ తో ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా అందిస్తూ ఎలాంటి అడల్ట్ బూతులు లేకుండా, క్లీన్ కామెడీ ని పండించడం ఎలాగో ఈ చిత్రం ద్వారా చూపించాడు డైరెక్టర్ రామ్ అబ్బరాజు. సినిమా లో ఉన్న ట్విస్టులు, తర్వాత ఏమి జరగబోతుంది , ఇలాంటివన్నీ మనకి అర్థం అయిపోతుంది. కానీ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వుకునేలా చేసాడు డైరెక్టర్.
కానీ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది కానీ, బోర్ మాత్రం కొట్టదు, కడుపుబ్బా అందరూ నవ్వుకునే రంజిలోనే సినిమా ఉంటుంది. ఇక కామెడీ టైమింగ్ లో శ్రీ విష్ణు కి మొదటి నుండి మంచి గ్రిప్ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
ఇక ఈ సినిమాలో హీరో తర్వాత హీరో లాంటి వాడు నరేష్. చాలా కాలం తర్వాత ఆయనకీ ఒక అద్భుతమైన క్యారక్టర్ దొరికింది అనే చెప్పాలి. 60 ఏళ్ళ వయస్సు లో డిగ్రీ పూర్తి చెయ్యాలని అతను పడే తంటాలు, మనకి మామూలు రేంజ్ లో నవ్వు రప్పించదు. ఇక సెకండ్ హాఫ్ కాస్త ఫ్లాట్ గా వెళ్తుంది అని అనుకుంటున్న సమయం లో వెన్నెల కిషోర్ ఎంట్రీ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.
ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కుల శేఖర్ పేరుతో కుల పిచోడిలాగా చాలా అద్భుతంగా నటించాడు. ఇక ఈ సినిమాకి మైనస్ ఏమైనా ఉందా అంటే అది పాటలే. సాధారణంగా గోపి సుందర్ తన ప్రతీ సినిమాలో ఒక్క పాట అయినా అద్భుతంగా ఇస్తాడు . ఈ సినిమాకి వచ్చే సరికి కంప్లీట్ మిస్ ఫైర్ అయ్యాడు. పాటలు కనుక ఈ చిత్రం లో క్లిక్ అయ్యుంటే, ఈ సినిమా రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉండేది.
చివరి మాట :
సరైన కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ చిత్రం ఎడారి లో దొరికిన ఒయాసిస్ లాంటిది. కుటుంబం తో కలిసి రెండు గంటల పాటు పొట్టచెక్కలు అయ్యే విధంగా నవ్వుకోవచ్చు. ఈ వీకెండ్ మిస్ కాకండి.
రేటింగ్ : 3 /5