Salman Khan : హీరోలకు కటౌట్లు పెట్టడం, వాటికి పూలదండలు వేయడం, బ్యానర్లు కట్టడం, స్క్రీన్ పై హీరో కనిపించగానే పేపర్లు చింపి విసరడం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ సరికొత్త ట్రెండ్ మొదలుపెట్టారు. థియేటర్లో సినిమా ప్రదర్శితం అవుతున్న సమయంలో సీట్ల మధ్యలో టపాసులు పేలుస్తున్నారు. ఫ్యాన్స్ చేస్తున్న ఈ పనిని పిచ్చి అనుకోవాలో లేక పైత్యం అనుకోవాలో తెలియడం లేదు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ -3 ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణంలో ఉన్న సింగిల్ స్క్రీన్ లో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. దీపావళి పండగ రోజు సెకండ్ షోకు థియేటర్ కు వచ్చిన అభిమానులు సల్మాన్ ఎంట్రీ సమయంలో సీట్ల మధ్యలో టపాసులు పెట్టి పేల్చారు. టపాసులన్నీ ఒక్కసారిగా పేల్చడంతో థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు భయంతో వణికిపోయారు. కొందరైతే బయటికి పరుగులు తీశారు.

థియేటర్లో టపాసులు పేలుతున్న సమయంలో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి వైరల్ కావడంతో సల్మాన్ ఖాన్ స్పందించాడు. అభిమానులపై సీరియస్ అయ్యాడు. ‘టైగర్ -3 ప్రదర్శిస్తుండగా థియేటర్లో టపాసులు కాల్చిన వీడియోలను చూశా. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఇటువంటి చర్యలు మనతోపాటు ఇతరులకు కూడా ప్రమాదకరం. అభిమానులు ఇటువంటి చర్యలు మానుకోవాలి. సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం. సురక్షితంగా ఉందాం’ అని సూచించారు.