Pallavi Prashanth : ఒక సామాన్య రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి టైటిల్ గెలుచుకొని చరిత్ర తిరగ రాసిన పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత అన్నీ కష్టాలే. ఈ సీజన్ రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ తన ఫ్యాన్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. మరో పక్క శివాజీ తన కుటుంబం తో సంతోషంగా గడుపుతున్నాడు, యావర్, ప్రియాంక మరియు గౌతమ్ వంటి వారు రోజుకో పార్టీ చేసుకుంటూ హ్యాపీ గా ఉన్నారు.

కానీ మన రైతు బిడ్డ మాత్రం హౌస్ నుండి బయటకి రాగానే జరిగిన కొన్ని సంఘటనల కారణంగా చంచల్ గూడ జైలు లో రెండు రోజులు గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత అతనికి బెయిల్ రప్పించడానికి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన భోలే ఎంతో కష్టపడ్డాడు. తనకి తెలిసిన లాయర్స్ అందరినీ సంప్రదించాడు.

కానీ నాన్ బైలబుల్ వారెంట్ కారణంగా ప్రశాంత్ కి అంత తేలికగా బైల్ దొరకలేదు. దీంతో భోలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రశాంత్ పరిస్థితి ని వివరించాడు. అప్పుడు ప్రభుత్వం తరుపున లాయర్ ని పంపించి బైల్ వచ్చేలా చేసాడట రేవంత్ రెడ్డి. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక పల్లవి ప్రశాంత్ జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత ఆయన అభిమానుల్లో ఆనందం మామూలు రేంజ్ లో లేదు.

పోలీసులు ఎలాంటి పరిమితులు పెట్టారో ఏమో తెలియదు కానీ, బయటకి వచ్చిన తర్వాత ఆయన ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. బిగ్ బాస్ తర్వాత అతను ఏమి చెయ్యబోతున్నాడు అనే దాని మీద కూడా ఎలాంటి క్లారిటీ లేదు. గెలిచిన డబ్బులను రైతుల కోసం ఖర్చు చేస్తా అన్నాడు, అది ఎప్పుడు ఎలా చేస్తాడో కూడా ఎవరికీ తెలియదు.