Rashmika Mandanna బహుభాషా నటి మాత్రమే కాదు… బహు భాషలు తెలిసిన నటి! ఇప్పుడు ‘యానిమల్’ కోసం ఆవిడ మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పారు. రష్మికకు మొత్తం ఆరు భాషలు వచ్చు. కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం (కొడగు జిల్లా)లో ఆమె జన్మించారు. రష్మిక మాతృభాష కొడవ. కూర్గ్ ఏరియాలో మాట్లాడే ద్రవిడియన్ భాష అది. దాంతో పాటు ఆవిడకు కన్నడ వచ్చు. మాతృభాష, కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషలు రష్మికకు వచ్చు.

ఇక, ఆవిడ డిగ్రీ ఏంటో తెలుసా? బెంగళూరులో డిగ్రీ చేశారు. సైకాలజీ, జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. అందుకని, ఇంగ్లీష్ బాగా వచ్చు. ‘యానిమల్’ కోసం హిందీ, తెలుగు, కన్నడలో రష్మిక డబ్బింగ్ చెప్పారు. రష్మిక పాత్ర గురించి చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ”రష్మిక గారిది ‘యానిమల్’లో చాలా ముఖ్యమైన పాత్ర. సినిమా ఆద్యంతం ఆమె కనిపిస్తూ ఉంటారు. రెగ్యులర్ సినిమాల్లో ఉన్నట్టు కాకుండా కాకుండా చాలా వైవిధ్యంగా ఉంటుంది. హీరోని అతని తల్లిదండ్రుల కంటే ఎక్కువ అర్ధం చేసుకున్న పాత్ర ఆమెది.

ఇందులో హీరో తర్వాత అంతటి ప్రాధన్యత వున్నది రష్మిక, అనిల్ కపూర్ పాత్రలకే. ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉంటుంది” అని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రచారం కోసం రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాతో పాటు రష్మిక కూడా వివిధ నగరాలు తిరుగుతున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ షోకి వచ్చారు.