తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ గురించి పెద్దగా చెప్పనసరం లేదు. ‘జబర్దస్త్’ షో లో యాంకర్ గా చేసి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. అడపా దడపా సినిమాల్లో కూడా నటించి తన గ్లామర్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. మూగ జీవాలను హింసిస్తే అసలు చూస్తూ ఉండలేదు. వాటిన ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి జంతుప్రేమికురాలిగా ఆమె చేసే ట్వీట్లు, పోస్ట్ లు మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి. తాజాగా రష్మీ గౌతమ్ చేసిన ఓ పోస్ట్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. ఆమె చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
బక్రీద్ సందర్భంగా రష్మీ ఓ పోస్ట్ పెట్టింది. సాధారణంగా ప్రతి పండుగ సమయంలో ఆమె ఇలాంటి పోస్ట్‌లు పెడుతుంటుంది. జంతువులను హింసించి, బలిచ్చే ఆచారాలపై ఆమె మండిపడుతూ ఉంటుంది. తాజాగా గురువారం మరోసారి జంతుబలి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. అయితే రష్మీ ట్వీట్ పై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. నీకు ప్రతిసారి పండగల సమయంలోనే జంతువులపై ఎందుకు అంత ప్రేమ? పెద్ద పెద్ద కంపెనీలు నాన్ వెజ్ ను బ్రాండ్ గా క్రియేట్ చేసి అమ్ముతున్నాయి.. వారిని ఎందుకు ప్రశ్నించవు? ఫేమస్ కావడం కోసం ఇలాంటివి చేస్తుంటారు… అంటూ పలువురు నెటిజన్లు ఆమె పోస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందాడు. ఆ ఘటన అందర్నీ కలచివేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కొంత మంది సెలబ్రెటీలు కూడా దీనిపై స్పందించారు. ఈ నేపథ్యంలోనే రష్మిక కూడా కుక్కల దాడి ఘటనపై స్పందిస్తూ అందులో కుక్కల తప్పేమి ఉంది అన్నట్టు వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్స్ మండి పడ్డారు.
ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ‘నువ్ ఎంత జంతు ప్రేమికురాలివి కుక్కల దాడిలో ఓ చిన్నారి చనిపోతే కనీసం సానుభూతి కూడా లేకుండా ఇలా మాట్లాడతావా’ అంటూ ఫైర్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు రష్మీ బక్రీద్ పండగ సమయంలో జంతు ప్రేమను ప్రదర్శిస్తూ ట్వీట్ చేయడంపై మండి పడుతున్నారు నెటిజన్స్. మరి దీనిపై రష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి.