Rangabali Review : స్టార్ హీరో అయ్యేందుకు అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ, కాలం కలిసిరాక ఇప్పటికీ మీడియం రేంజ్ హీరో గా మిగిలినపోయిన వారిలో ఒకరి నాగ శౌర్య. ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈయన తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఇతను చేసిన సినిమాలలో సూపర్ హిట్ అయ్యినవి చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు.
ప్రతీ సినిమాతో ఎదో విధంగా కొత్తగా ట్రై చెయ్యాలని చూస్తాడు కానీ, అవి చివరికి వికటించి అట్టర్ ఫ్లాప్స్ గా మిగులుతుంటాయి. అలా వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నాగ శౌర్య ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే కసితో చేసిన చిత్రం ‘రంగబలి’. టీజర్ , ట్రైలర్స్ తో పాటుగా ప్రొమోషన్స్ విషయం లో కూడా ప్రేక్షకులను విశేషం గా ఆకర్షించిన ఈ చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాం.
కథ :
తన సొంత ఊరు రాజవరం లో రాజులాగా దర్జాగా బ్రతకాలని అనుకుంటూ ఉంటాడు శౌర్య అలియాస్ షో (నాగ శౌర్య). తన మారుపేరు కి తగ్గట్టుగానే ప్రతీ విషయం లో ‘షో’ చేస్తూ అందరి దృష్టిని తనవైపు ఉండేలా చేసుకోడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా బిల్డప్స్ ఇచ్చే ఈయన ‘రంగబలి’ సెంటర్ కి వచ్చినప్పుడల్లా పడుతూనే ఉంటాడు. ఇక ఆ ఊరి ఎమ్యెల్యే పరశురామ్ కి శౌర్య బాగా కావాల్సిన వ్యక్తి. తనకి ఏ అవసరం వచ్చినా చేసి పెడుతుంటాడు శౌర్య. ఆవారా లాగ తిరుగుతున్నా కొడుకుని చూసి బాధపడుతున్న శౌర్య తండ్రి, ఎలా అయినా వాడికి బాధ్యతలు అప్పగించాలి అనే ఉద్దేశ్యం తో తాను నడుపుతున్న మెడికల్ షాప్ బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు.
అందుకోసం వైజాగ్ లో మెడిసిన్ చదివించడానికి పంపిస్తాడు శౌర్య ని. అక్కడ కాలేజీ లో శౌర్య కి సహజ (యుక్తి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. కాలక్రమేణా ఇద్దరు ప్రేమలో పడుతారు. ఇక అక్కడి నుండే అసలు సమస్య మొదలు. ఆ అమ్మాయికి అసలు రంగబలి కి సంబంధం ఏమిటి?, రంగబలి తో శౌర్య కి ఎలాంటి గతం ముడిపడి ఉంది అనేది మిగతా స్టోరీ!.
విశ్లేషణ :
రొటీన్ సబ్జెక్టు అయ్యినప్పటికీ డైరెక్టర్ పవన్ బాసం శెట్టి, పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో నింపేసి ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకులను బాగా నవ్విస్తాడు. ముఖ్యంగా సత్య కామెడీ లేకపోతే ఈ సినిమాని అసలు ఊహించుకోలేం. ఫస్ట్ హాఫ్ మొత్తం అతని కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కొన్ని కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి. అలా ప్రథమార్థం మొత్తం ఫన్ తో నింపేసాడు డైరెక్టర్, ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కూడా వర్కౌట్ అయ్యింది.
సెకండ్ హాఫ్ ఏమి జరగబోతుంది అనే విషయం అందరికీ అర్థం అయ్యిపోతాది. ఇలాంటి సమయం లో సెకండ్ హాఫ్ కచ్చితంగా బాగుండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రొటీన్ కమర్షియల్ సినిమాలకు ప్రేక్షకులు చివరి దాకా కూర్చోవాలి అంటే ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ తో సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కామెడీ చాలా తక్కువ అనిపిస్తుంది.
సినిమాలోని కథ కూడా బాగా ట్రాక్ తప్పుతుంది, ఏంటి ఈ సోది అనే ఫీలింగ్ ప్రేక్షకులకు పలు సందర్భాలలో అనిపిస్తాయి. డైరెక్టర్ ఈ సినిమా ద్వారా చెడు విషయాలను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం మంచి గురించి మాత్రమే మాట్లాడుకుందాము అని చెప్పడానికి ప్రయత్నం చేసాడు. సగం సక్సెస్ అయ్యాడు కానీ, సగం సక్సెస్ కాలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ ఆడియన్స్ కి అసలు ఎక్కదు.
హీరో మాట్లాడే కేవలం 5 నిమిషాల స్పీచ్ కి అందరూ మారిపోవడాన్ని ఆడియన్స్ అంగీకరించలేరు. ఇక నాగ శౌర్య ఎప్పటిలాగానే ఈ సినిమా కోసం కూడా చాలా బాగా కష్టపడ్డాడు. అతని కామెడీ టైమింగ్ కూడా పలు సన్నివేశాలలో బాగా పేలింది. హీరోయిన్ యుక్తి కూడా చూసేందుకు వెండితెర పై ఎంతో అందంగా ఉంది, యాక్టింగ్ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో చేసింది. ఇక ఈ సినిమాలోని పాటలు మరియు నేపధ్య సంగీతం అంతగా ఆకట్టుకునేలా లేవు.
చివరి మాట :
అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా అని చెప్పలేము, అలా అని బాగాలేదు అని కూడా చెప్పలేము, కాసేపు ఎదో టైం పాస్ కోసం చూద్దాం అనుకునేవాళ్లకు ఈ సినిమా కచ్చితంగ నచుతుంది .
నటీనటులు: నాగశౌర్య, యుర్తి తరేజ, గోపరాజు రమణ, షైన్ టామ్ చాకో, సత్య, శరత్ కుమార్, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్
దర్శకుడు: పవన్ బాసంశెట్టి.
సంగీతం : పవన్ సీహెచ్.
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
రేటింగ్ : 2.5 /5