Ranga Maarthaanda నటీనటులు : ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ
డైరెక్టర్ : కృష్ణ వంశీ
సంగీతం : ఇళయరాజా
బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్
Ranga Maarthaanda క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సుదీర్ఘ విరామం తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’.అతి తక్కువ బడ్జెట్ తో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ మరియు బ్రహ్మానందం వంటి నటీనటులను పెట్టుకొని ఈ సినిమాని తెరకెక్కించాడు.టీజర్ మరియు ట్రైలర్ తోనే ఒక మంచి సినిమాని చూడబోతున్నాము అనే అనుభూతిని కలిగించాడు కృష్ణ వంశీ.ముఖ్యంగా నాలుగు దశాబ్దాల నుండి తన హాస్యం తో ప్రేక్షకుల పొట్టలు చక్కలు అయ్యేలా చేసిన బ్రహ్మానందం తో ఒక ఎమోషనల్ పాత్ర చేయించడం అంటే కత్తి మీద సాము లాంటిదే.మరాఠి లో సూపర్ హిట్ గా నిల్చిన ‘నట సామ్రాట్’ అనే పేరు తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు అలరించిందో ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
రంగస్థల మహానటుడు రాఘవయ్య( ప్రకాష్ రాజ్) తన అద్భుతమైన నటన తో దశాబ్దాల నుండి ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడని ఒకరోజు ఆయనకీ ప్రత్యేకమైన సన్మానం చెయ్యడానికి సభ ఏర్పాటు చేస్తారు.ఆ సభలో ఆయనకీ రంగమార్తాండ అనే బిరుదు ఇచ్చి సత్కరిస్తారు.ఆ తర్వాత రాఘవయ్య అభిమానులను ఉద్దేశిస్తూ కొన్ని మాటలు మాట్లాడి చివర్లో తానూ ఇక రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అని ఒక ప్రకటన చేసి షాక్ కి గురి చేస్తాడు.ఇన్నాళ్లు ఆయన సంపాదించిన డబ్బు మరియు ఆస్తులను తన కొడుకు మరియు కూతురికి రాసి ఇచ్చి, ఇక మిగిలిన శేష జీవితాన్ని తన భార్య ( రమ్య కృష్ణ ) తో ప్రశాంతం గా జీవించాలని అనుకుంటాడు.కానీ పిల్లలే సర్వస్వము అనుకోని బ్రతికే ఈ ముసలి దంపతులను పిల్లలు ప్రశాంతంగా బ్రతకనివ్వరు.వాళ్ళ కారణం చేత వీళ్ళు ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తాది.అప్పుడు రాఘవయ్య ప్రాణ స్నేహితుడు చక్రపాణి( బ్రహ్మానందం) వద్దకి వెళ్లిన తర్వాత, ఆయన వల్ల వీరి జీవితాలు ఎలా మలుపు తిరుగుతుంది అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
డైరెక్టర్ కృష్ణవంశీ ఒక సినిమాని తియ్యలేదు..మన జీవితాలనే వెండితెర మీద చూపించే ప్రయత్నం చేసాడు.ప్రతీ సన్నివేశం మన హృదయాలను తాకుతుంది,మన జీవితం లో చోటు చేసుకున్న సంఘటలను గుర్తు చేస్తుంది ఈ సినిమా.ఇది వరకు ఆయన తీసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా మరో ఎత్తు.అంత అద్భుతంగా తెరకెక్కించాడు ఆయన.నటీనటుల నుండి అద్భుతమైన నటనని రాబట్టుకునే అలవాటు ఉన్న కృష్ణ వంశీ మరోసారి ఈ చిత్రం ద్వారా అదే చేసాడు.ప్రకాష్ రాజ్ నటన ప్రతీ ఒక్కరి హృదయాలను తాకుతుంది.ఒక సగటు తండ్రి పడే ఆవేదన ప్రకాష్ రాజ్ లో మనం చూసుకోవచ్చు.అంత అద్భుతంగా నటించాడు ఆయన.ఇక రమ్య కృష్ణ గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది .ఒక గృహిణి గా, ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి గా ఆమె నటించిన తీరు అమోఘం.
ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం నటనకి ఈ ప్రపంచం లో ఏ అవార్డు కూడా సరితూగదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.కచ్చితంగా మన ప్రేక్షకులు డైరెక్టర్స్ బూతులు తిట్టుకుంటారు.ఎందుకంటే ఇంత అద్భుతమైన నటుడిని ఇన్ని రోజులు కేవలం కామెడీ కి మాత్రమే వాడుకున్నారు అని.చక్రపాణి గా ఆయన కనబర్చిన నటనకి కళ్ళలో నుండి నీళ్లు రాక తప్పదు.చాలా కాలం గ్యాప్ తీసుకొని ఇలాంటి పాత్రతో బ్రహ్మానందం మన అందరిని షాక్ కి గురి చేస్తాడని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు.ఇక ఇళయరాజా అందించిన పాటలు మరియు నేపధ్య సంగీతం సందర్భానికి తగ్గట్టుగా ఒక కొత్త అనుభూతిని కలిగించే విధంగా ఉంది.
చివరి మాట :
మంచి సినిమాలు తియ్యండి అంటూ మేకర్స్ ని ప్రశ్నించే ప్రేక్షకులు ఇప్పుడు వచ్చిన ఈ గొప్ప సినిమాని చూసి ఆదరించకపోతే, భవిష్యత్తులో మంచి సినిమాలు తియ్యడం లేదు అని మేకర్స్ ని ప్రశ్నించే హక్కుని కోల్పోతారు.రంగమార్తాండ అంత మంచి సినిమా.మన జీవితాలను కాసేపు వెండితెర మీద చూసుకునేందుకు ఈ వీకెండ్ కుటుంబం తో కలిసి ఈ సినిమాని వీక్షించండి.
రేటింగ్ : 3 /5