Ramoji Rao : రామోజీరావు కన్నుమూత .. సామాన్యుడి నుంచి తిరుగులేని మీడియా దిగ్గజంగా

- Advertisement -

Ramoji Rao : రామోజీరావు కన్నుమూత .. సామాన్యుడి నుంచి తిరుగులేని మీడియా దిగ్గజంగా
Ramoji Rao : ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా ఆయన మంచానికే పరిమితమయ్యారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు నానక్ రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనకు స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించారు. కానీ, రాత్రి ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన భౌతికకాయాన్ని ఫిలింసిటీలోని ఆయన నివాసానికి తరలించారు.

చెరుకూరి రామోజీ రావు నవంబర్ 16, 1936న అప్పటి కృష్ణాజిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. చిన్న తనం నుంచే చురుగ్గా ఉండే ఆయన తెలుగు సినీ, మీడియా, వ్యాపార రంగాల్లో తనదైన ముద్రవేశారు. రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య . ఓ చిరుద్యోగిగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన నేడు వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. పారిశ్రామికంగా, భారతీయ చలనచిత్ర పరిశ్రమ, మీడియాకు తన గణనీయమైన కృషి చేశారు. హైదరాబాద్‌లోని అతిపెద్ద ఫిల్మ్ సిటీ అయిన రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించాడు. ఇది 2,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సెట్‌లు, స్టూడియోలు, పోస్ట్-ప్రొడక్షన్ సేవలతో సహా ఫిల్మ్ ప్రొడక్షన్ కోసం ఒక సమగ్ర సౌకర్యంగా పనిచేస్తుంది. రామోజీ ఫిలిం సిటీ కేవలం చిత్రీకరణ కేంద్రంగా మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి సందర్శకులను ఆకర్షిస్తూ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కూడా ఉంది.

- Advertisement -

తొలుత ఢిల్లీలో ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్‌గా చేరిన ఆయన మూడేళ్ల కాలంలోనే ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నాడు. 1962లో తిరిగి హైదరాబాద్ వచ్చి ‘మార్గదర్శి’ చిట్‌ఫండ్ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం మార్గదర్శి అనేక నగరాల్లో బ్రాంచుల ద్వారా విశ్వసనీయమైన, విలువ రూ. వేల కోట్ల ఆస్తులను కలిగిఉంది. తర్వాత తనకు ఎంతో ఇష్టమైన అడ్వర్టైజింగ్‌ రంగంలో అడుగుపెట్టారు. 1965లో కిరణ్ యాడ్స్ కంపెనీని స్థాపించారు. దీనితో పాటు 1967-1969 కాలంలో ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల బిజినెస్ లోనూ దిగారు. రామోజీరావు ఈనాడు సంస్థను స్థాపించేందుకు ముందే అన్నదాత అనే దినపత్రికను స్థాపించారు. 1970లో ఇమేజెస్ ఔట్‌డోర్ అడ్వర్టైజ్‌‌మెంట్ ఏజెన్సీని ఆరంభించారు. 1974 ఆగస్ట్ 10 విశాఖలో ‘ఈనాడు’ ఆవిర్భవించి పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించింది.

5000 ప్రతులతో ప్రారంభమైన ఈనాడు..నేడు దాదాపు 18 లక్షల సర్క్యూలేషన్ తో తెలుగు పత్రికల్లో నంబర్ వన్ స్థానంలో నిలచింది. పత్రికారంగంలో సక్సెస్ సాధించి.. 1995లో ఈటీవీని స్థాపించారు . తెలుగుతో పాటు భాషల్లోనూ ఛానెల్స్ ప్రారంభించి అప్పట్లో అతిపెద్ద టెలివిజన్ నెట్‌వర్క్‌గా ఈటీవీని నిలబెట్టారు. 1996లో హైదరాబాద్ – విజయవాడ హైవేకు అనుకుని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. జీవితంలో ఎన్నో విజయాలు అందుకున్న రామోజీరావును ఎన్నో పురస్కారాలు వరించాయి. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. రామోజీరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here