2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగు అభిమానులకు పరిచయమైంది పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్‌లోని అగ్రకథానాయకులతో నటించి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు అటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోను ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాదిలో విడుదలైన ‘ఛత్రివాలి’, ‘భూ’, ‘ఐ లవ్ యూ’ లాంటి సినిమాలో భిన్నమైన పాత్రలు పోషించి చిత్రపరిశ్రమలో మంచి స్థాయికి చేరుకుంది.

నటిగా ముందుకు సాగుతూ పాన్ ఇండియా రీచ్‌లో అభిమానులను సొంతం చేసుకున్న రకుల్ వివిధ భాషల్లో నటించడానికి వచ్చిన అవకాశం గురించి మాట్లాడుతూ…‘ఒక నటిగా నా జీవితంలో ఇది ఉత్తేజకరమైన దశ. అన్ని భాషల్లో సినిమాలు చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. అలాంటి అవకాశాలు వస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. సరిహద్దులు దాటుతూ…భాషతో సంబంధం లేకుండా కథతో ప్రేక్షకులతో మాట్లాడే అవకాశం సినిమాల వల్ల రావడం చాలా సంతోషం’ అని తెలిపింది. ‘నా రాబోయే చిత్రాలన్నీ వివిధ భాషల్లో ఉంటాయి.

‘మేరి పత్ని కా రీమేక్’, ‘భారతీయుడు 2’, ‘అలయాన్’ లాంటి సినిమాలు కొన్ని చిత్రీకరణలో ఉండగా మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. అభిమానులు ఆ సినిమాలు చూస్తూ ఎలా అనుభూతి చెందుతారో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. ఎప్పటిలాగే నాపై ప్రేమను చూపుతూనే ఉంటారని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్.