Rajinikanth : హీరో రజనీకాంత్ సినిమాల్లో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు. అయితే రియల్ లైఫ్ లో మాత్రం ఆయన ఎంతో సింపుల్ గా ఉంటారు. రజనీకి ఆధ్యాత్మిక చింతన కూడబా ఎక్కువే. ప్రజల పట్ల ఎంతో అభిమానం ఉన్న రజనీకాంత్ రాజకీయాల్లోకి కూడా రావాలని నిర్ణయించుకున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ఆయన తన రాజకీయ పార్టీని సమాజ్ సేవా సంఘ్‌గా మార్చారు. రాజకీయాల్లోకి రానప్పటికీ సేవా కార్యక్రమాల్లో మాత్రం వెనక్కు తగ్గలేదు రజనీ.

ఇప్పుడు పేదల కోసం ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట సూపర్ స్టార్. ఇందుకోసం ఇటీవల తమిళనాడులోని చంగల్‌పట్టు జిల్లా తిరుప్పురూర్‌లో పర్యటించారు. అక్కడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించి తాను కొనుగోలు చేసిన 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ 12 ఎకరాల స్థలంలో రజనీకాంత్ ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు సమాచారం. అదే కారణంతో రజనీకాంత్ ఈ స్థలాన్ని కొనుగోలు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నై-తిరుప్పురూర్ మధ్య దాదాపు 45 కిలోమీటర్ల దూరం ఉందని, చెన్నై-తిరుప్పురూర్ మధ్య 12 ఎకరాల భూమిని రజనీకాంత్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రణాళిక సిద్ధంగా ఉందని చెప్పారు. మరికొద్ది రోజుల్లో రజనీకాంత్ ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేయబోతున్నారని, ఇందుకోసం మంచి రోజు చూసుకోనున్నారని తెలుస్తోంది. పేదల కోసం ఈ ఆసుపత్రిని నిర్మించి ఉచితంగా వైద్యం అందించే ఆలోచనలో ఉన్నారట రజనీ.