ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదంపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఒకే చోట మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఆగి ఉన్న గూడ్స్ రైలుని అదే ట్రాక్ పై వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో బోగీలు ఎగిరి పక్క ట్రాక్ పై పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్ పై మరో రైలు వేగంగా వస్తుంది. బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 300 మందికి పైగా మరణించారు. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్లు విమర్శలకు తావిచ్చాయి. ఇందుకు కారణం అతను రైలు ఎదుట విన్యాసాలను పోస్ట్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీడియోలు ట్వీట్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియోలను షేర్ చేశాడు. ఓ వైపు వేలాది కుటుంబాలు కన్నీటి సముద్రంలో మునిగిపోయిన సమయంలో.. రాహుల్ ఇలాంటి విన్యాసాలు షేర్ చేయడం ఏంటని నెటిజన్లు మండిపడ్డారు.

వెంటనే రాహుల్ రామకృష్ణ ఆ ట్వీట్ ని తొలగించి క్షమాపణలు చెప్పారు. ‘మునుపటి ట్వీట్ విషయంలో నన్ను క్షమించండి. ఈ విషాదం గురించి నిజంగా నాకు తెలియదు. ఒట్టు. అర్ధరాత్రి నుంచి స్క్రిప్ట్ రాస్తున్నాను. వార్తలను ఫాలో అవ్వలేదు. క్షమించండి’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్స్ శాంతించారు.‘మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. మిమ్మల్ని ట్రోల్ చేయడానికి కాదు, ఆ ఘటన గురించి మీకు తెలియడానికి సమాచారం ఇవ్వాలనుకున్నాను అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేయగా దానికి రాహుల్ రామకృష్ణ స్పందించారు. ‘కృతజ్ఞతలు.. గత కొన్ని గంటలుగా నేను వార్తలను అనుసరించడం లేదు. నా పని మీద శ్రద్ధ పెట్టడానికే ప్రయత్నిస్తున్నాను. ఇది ఖచ్చితంగా తప్పే. నన్ను అలర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు’ అంటూ రాహుల్ రామకృష్ణ సమాధానమిచ్చారు.