Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఈ పేరును ప్రత్యేకంగా ప్రజలకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈయన కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అనంతరం నటుడుగా, హీరోగా, దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇటీవలే చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. కానీ ఈ సినిమా ఫస్ట్ పార్టు అంత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత లారెన్స్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో ‘జిగర్ తిండ డబల్ ఎక్స్’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ లో పాల్గొన్న లారెన్స్ తన తన అభిమానుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. సినిమా విడుదలైన ప్రతిసారి అభిమానుల కోసం లారెన్స్ ఏదో ఒకటి చేయాలనుకుంటానని తెలిపాడు. అందుకే ఈసారి తన అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని త్వరలోనే నిర్మించబోతున్నట్లు ప్రకటించాడు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో కూడా తెలిపాడు. ఇంతకుముందు తన అభిమాని ఒకరు పెళ్లి పత్రిక ఇస్తూ లారెన్స్ ను పెళ్లికి ఆహ్వానించాడట.

పెళ్లి ఎక్కడ అని అడిగితే.. ఇంట్లోనే కానీ సరైన వసతి లేదని తెలిపాడట. కళ్యాణ మండపంలో చేసుకుందామంటే అంత డబ్బు లేదు అన్నాడట. పెళ్లి అనేజి జీవితంలో చేసుకునే మధురమైన ఘట్టం అయినా అతని ముఖంలో అప్పుడు సంతోషం లేదు. అందుకే అమ్మ పేరుతో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపాడు. అక్కడ వంట పాత్రలతో సహా అన్ని ఉంటాయి. రూపాయి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే పెళ్లి చేసుకోవచ్చంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న లారెన్స్ అభిమానులు.. ఎప్పుడూ తన అభిమానుల కోసం పాటు పడే తమ అభిమాన నటుడిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.