Salar : భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు ఇండియా మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల కావాల్సింది. కానీ కొన్ని సినిమాల చాలా సన్నివేశాలు రీ షూట్ చెయ్యాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి అనిపించడం తో డిసెంబర్ 22 వ తారీఖుకి వాయిదా వేశారు మేకర్స్.
ఎవరొచ్చినా రాకపోయినా ఆ రోజు సలార్ థియేటర్స్ లోకి వస్తుందని, అడ్డొచ్చిన వాళ్ళను తొక్కుకుంటూ వెళ్తుందని అభిమానులు గర్వంగా చెప్పుకున్నారు. కానీ లేటెస్ట్ గా మారుతున్న సమీకరణాలు చూస్తుంటే ‘సలార్’ చిత్రం డిసెంబర్ 22 న కూడా విడుదలయ్యే ఛాన్స్ లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇది ప్రభాస్ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం. ఎందుకు మళ్ళీ వాయిదా పడబోతోంది అనేందుకు చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
ఈ సినిమా విడుదలయ్యే రోజే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖా హీరో గా నటించిన ‘డుంకీ’ చిత్రం విడుదల అవ్వబోతుంది. వరుసగా రెండు వెయ్యి కోట్ల రూపాయిల సినిమాల తర్వాత రాజ్ కుమార్ హిరానీ లాంటి నెంబర్ 1 డైరెక్టర్ తో షారుఖ్ ఖాన్ చేస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమా మీద కూడా అంచనాలు మామూలుగా లేవు. ఈ చిత్రం వల్ల సలార్ చిత్రానికి బాలీవుడ్ థియేటర్స్ భారీగా తగ్గుతాయి. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్ , వైజాగ్ వంటి ప్రాంతాలలో సలార్ చిత్రానికి తక్కువ షోస్ వస్తాయి.
అయినా కూడా పర్వాలేదు మేము డిసెంబర్ 22 వ తారీఖునే వస్తామని మేకర్స్ అన్నారు. కానీ అదే రోజు మరో క్రేజీ మూవీ కూడా విడుదల అవ్వబోతుంది. హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఊపేసిన ‘ఆక్వా మ్యాన్’ సీక్వెల్ కూడా డిసెంబర్ 22 వ తేదీన విడుదల అవ్వబోతుంది. ఈ చిత్రం విడుదలైతే ఓవర్సీస్ లో సలార్ చిత్రానికి భారీగా షోస్ కౌంట్ తగ్గిపోతుంది. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి సలార్ లిమిటెడ్ రిలీజ్ పడితే బ్రేక్ ఈవెన్ మార్కుని చేరుకోవడం అసాధ్యం. అందుకే ఈ సినిమాని సంక్రాంతికి వాయిదా వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.