Ponniyin Selvan 2 Review : మణిరత్నం తన ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ మొదటి భాగాన్ని గత ఏడాది విడుదల చేసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ సినిమా తో ఆయన కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా సక్సెస్ సాధించి కోట్ల రూపాయిల లాభాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
తమిళ ప్రజలు ఈ చిత్రాన్ని ఒక ఉద్యమం లాగ చూసారు.సుమారుగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఇతర బాషలలో యావరేజి గా ఆడింది.అందుకు కారణం ఈ చిత్రం మొత్తం తమిళ నేటివిటీ కి తగ్గట్టుగా ఉండడమే.మణిరత్నం ఈ సినిమా రెండు భాగాలను కేవలం 150 రోజుల్లో తీసాడు. రెండవ భాగం నేడు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలైంది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది, పార్ట్ 1 లాగానే ఈ రెండవ భాగం కూడా భారీ విజయం సాధిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

కథ :
చోళ రాజ్యానికి యువరాజు అరుణ్ మొళి వర్మ అలియాస్ పొన్నియన్ సెల్వన్ (జయం రవి) మరియు వల్లవరాజన్(కార్తీ ) తుఫాను వీస్తున్న సమయం లో సముద్రం నడిబొడ్డున్న పాండ్య సైన్యం తో యుద్ధం చేస్తూ సముద్రం లో మునిగిపోతారు. అయితే తన బిడ్డ పొన్నియన్ సెల్వన్ కి ఏ ఆపద వచ్చినా దేవతలాగా ప్రత్యక్షమై అతనిని కాపాడి అదృశ్యమయ్యే మందకాని (ఐశ్వర్య రాయ్) సముద్రం దూకి అరుణ్ మొళి తో పాటుగా వల్లవరాజన్ ని కూడా ప్రాణాలతో కాపాడుతుంది.
పొన్నియన్ సెల్వన్ మరియు వల్లవ రాజన్ చనిపోయాడని తెలుసుకున్న పాండ్యులు చోళ రాజ్యాన్ని ఆక్రమించడానికి వస్తారు.తన సోదరుడు చనిపోయాడని నమ్మి తీవ్రమైన దుఃఖం లో ఉన్న ఆదిత్య కరికాలుడు (విక్రమ్) చోళ రాజ్యం పై దండెత్తడానికి వచ్చిన ప్రతీ ఒక్కరిని చీల్చి చెండాడుతాడు.
అయితే ఎప్పటి నుండో ఆదిత్య కరికాలుడిపై పగతో రగిలిపోతున్న నందిని (ఐశ్వర్య రాయ్) ప్రేమ పేరుతో అతనిని వంచించి, తన కోటలోకి రప్పించుకొని చంపాలని చూస్తుంది. మరి నందిని తాను అనుకున్న పని చేసిందా..?,సొంత రాజ్యం లో జరుగుతున్న కుట్రలు ఒక పక్క, పాండ్యుల నుండి పొంచి ఉన్న పెను ప్రమాదం మరోపక్క.వీటి అన్నిటినీ ఎదుర్కొని పొన్నియన్ సెల్వన్ చోళ రాజ్యానికి రాజు ఎలా అయ్యాడు అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :
మొదటి భాగం లో వల్లవరాజన్ చిలిపి చేష్టలు , పొన్నియన్ సెల్వన్ కి ఆదిత్య కరికాలుడు ఇచ్చిన వర్తమానం ని అందచెయ్యడానికి ఆయన చేసిన ప్రయాణం, మధ్యలో ఏర్పడిన కొన్ని సంఘటనలు, నందిని కుట్రలు కుతంత్రాలు.మధ్య మధ్యలో తన బిడ్డని కాపాడుకోవడానికి వస్తున్నా ‘మందాకినీ’, ఇత్యాది సంఘటనలను చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్ మణిరత్నం.
ఇక రెండవ భాగం లో ఇంకా లోతుగా వెళ్లి పూర్తి స్థాయి నవల కథని ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా చెప్పే ప్రయత్నం చేసాడు మణిరత్నం.ఇందులో భావోద్వేగాలను కూడా చాలా చక్కగా ప్రేక్షకుల హృదయాలకు తాకే విధంగా చేసాడు.మొదటి భాగం కంటే రెండవ భాగమే బాగుంది అనిపించేంతలా ఆయన ఈ చిత్రం కోసం పనిచేసాడు.

ఇక AR రెహ్మాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ఆయువు పట్టులాంటిది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సౌండ్ మిక్సింగ్ థియేటర్ లో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి ని ఇచ్చింది.ఇక మందాకినీ గా నందిని గా ద్విపాత్రాభినయం చేసిన ఐశ్వర్య రాయ్ తనలోని నట విశ్వరూపం ని బయటకి తీసింది అనే చెప్పాలి.
ముఖ్యంగా నెగటివ్ రోల్ లో ఆమె జీవించేసింది,ఆదిత్య కరికాలుడిగా విక్రమ్,వల్లవరాజన్ గా కార్తీ మరియు పొన్నియన్ సెల్వన్ గా జయం రవి తమ పరిధిమేర మణిరత్నం విజన్ కి తగ్గట్టుగా అద్భుతంగా నటించారు, వీళ్ళకి కచ్చితంగా జాతీయ స్థాయిలో పురస్కారాలు దక్కుతాయని చెప్పొచ్చు. త్రిష వెండితెర మీద ఎంతో అందంగా కనిపించింది,కొన్ని సన్నివేశాల్లో ఆమె అందం లో ఐశ్వర్య రాయ్ ని కూడా డామినేట్ చేసింది.సినిమాకి ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏమిటంటే స్లో స్క్రీన్ ప్లే, ఇది తమిళ ఆడియన్స్ కి నచ్చుతుంది కానీ, మన తెలుగు ఆడియన్స్ కి నచ్చడం కష్టమే.
చివరి మాట :
పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం ని ఇష్టపడిన వాళ్లకు రెండవ భాగం మొదటి భాగం కంటే ఎక్కువగా నచుతుంది.
నటీనటులు : విక్రమ్ , కార్తీ , జయం రవి , త్రిష , ఐశ్వర్య లెక్ష్మి, ఐశ్వర్య రాయ్, శోభిత దూళిపాళ్ల, ప్రకాష్ రాజ్
సంగీత దర్శకుడు : AR రెహ్మాన్
డైరెక్టర్ : మణిరత్నం
నిర్మాతలు : మణిరత్నం, సుభాస్కరన్
రేటింగ్ : 2.75/5