Allu Arjun : క్షణ క్షణం గడుస్తున్నా కొద్ది ఏపీలో రాజకీయం బాగా వేడెక్కుతుంది. మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరుగనున్నాయి. శనివారం సాయంత్రంలో ప్రచారానికి తెరపడింది. చివరి రోజు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. అన్ని రాజకీయ పార్టీలు ఆఖరి ప్రచారాస్త్రాలను ప్రయోగించాయి. ఈ క్రమంలోనే ఓ వైపు అల్లు అర్జున్ అదేవిధంగా మరో వైపు రామ్ చరణ్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొని సందడి చేశారు. పిఠాపురంలో జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి హాజరై సందడి చేశాడు. అదే సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా నంద్యాలలో పర్యటించారు.
ఈ క్రమంలో అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై.. అలాగే వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి పై ఆర్వో ఫిర్యాదుతో నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు విషయం ఏంటంటే… ఎన్నికల ప్రచారంలో చివరి రోజు శిల్పా రవికి మద్దతుగా నంద్యాల పర్యటించడానికి అల్లు అర్జున్ వచ్చారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక 2024 ఏపీ ఎన్నికల్లో సినిమా నటీనటుల సందడి, ప్రచారాలు చేయడం ఎక్కువగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎంతోమంది చోటా మోటా స్టార్ సెలబ్రిటీస్ ప్రచారం చేశారు.
వారిలో జబర్దస్త్ టీం కమెడియన్స్, సీరియల్ నటులు, మెగా హీరోలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని పవన్ కల్యాణ్ కు మద్దతు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ఎన్నికల్లో వీరి సందడి నెలకొంది. ఈ క్రమంలో జనసేనకి మద్దతుగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసి.. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి స్నేహితుడు కావడంతో ఆయన కోసం ప్రచారం నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ ఆర్వో ఫిర్యాదు చేయడంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు.