ఈ మధ్యకాలంలో పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. గతంలో చాలా సార్లు బాలీవుడ్ ఇండస్ట్రీపై, ఫిలిం మేకర్స్ పై సంచలన ఆరోపణలు చేసి హాట్ టాపిక్ గా మారిన ఈ ముద్దుగుమ్మ హిందీ తో పాటు తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో కమిట్మెంట్ పేరుతో లైంగిక దోపిడీలపై సంచలన ఆరోపణలు చేయడంతో ఏకంగా ఇండస్ట్రీకే దూరమైంది.
ఆ వివాదం తర్వాత మళ్లీ పాయల్ బాలీవుడ్లో కనిపించింది లేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత తాజాగా మరోసారి బాలీవుడ్ పై తనదైన శైలిలో విరుచుకు పడింది. ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ ఇండస్ట్రీపై పాయల్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ” దేవుడి దయవల్ల సౌత్ సినిమాల ద్వారా పరిశ్రమంలోకి వచ్చాను. అలా కాకుండా ముందే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఉంటే నా దుస్తులు కూడా తొలగించేవారు. అలా చేసి నా పేరు మీద వ్యాపారం చేసుకునేవారు. వాళ్లకి టాలెంట్ తో పనిలేదు. దుస్తులు తీసేసి అమ్మాయిల అందాలు చూపిస్తే చాలు” అని తన ట్వీట్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
టాలీవుడ్ లో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ ఘోష్ ఆ తర్వాత సౌత్ లో అడపా దడపా సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాలో తమన్నాకు ఫ్రెండ్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా కనిపించలేదు. చివరగా ‘మిస్టర్ రాస్కెల్’ అనే సినిమాలో నటించింది. ఈమధ్య మాత్రం సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అవుతోంది.