మెగాస్టార్ చిరంజీవి నేడు 68వ ఏట అడుగుపెట్టబోతున్నారు. అన్నయ్య బర్త్‌డే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.నిన్న అర్ధరాత్రి దాటిన వెంటనే చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే, అందరి కంటే ముందుగా అన్నయ్యకు ఎంతో ఇష్టమైన తమ్ముడు కళ్యాణ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నయ్యకు ఒక మంచి లేఖతో శుభాకాంక్షలు తెలియజేశారు పవన్. అన్నయ్య చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన అధ్యక్షుడి హోదాలో ఒక నోట్ విడుదల చేశారు. ‘అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది.

మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని నోట్‌లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.