మహానటి సావిత్రి తర్వాత నిన్నటి తరం హీరోయిన్స్ లో సౌందర్య అంత గొప్ప నటి అనే పేరు వచ్చింది. ఆమె తర్వాత నేటి తరం హీరోయిన్స్ లో నటన అంటే మనకి గుర్తుకు వచ్చే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు నిత్యా మీనన్. మలయాళం లో బాలనటిగా పలు సినిమాల్లో నటించిన ఈమె, ఆ తర్వాత కొన్నాళ్ళకు మలయాళం లో హీరోయిన్ గా సినిమాలు చేస్తూ అక్కడ స్టార్ ఇమేజి ని సంపాదించింది.
ఆ తర్వాత తెలుగు లో ఈమె న్యాచురల్ స్టార్ నాని మరియు నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘అలా మొదలైంది’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా పెద్ద హిట్టైన తర్వాత, ఆమెకి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వెల్లువలాగా కురిశాయి. అలా అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యకుండా, చాలా సెలెక్టివ్ గా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తూ వచ్చింది.
దాదాపుగా కుర్రహీరోలందరి తో కలిసి సినిమాలు చేసిన ఈమె, స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ వంటి వారితో నటించింది. ఇక మలయాళం లో ఈమె దుల్కర్ సాల్మన్ తో చాలా సినిమాలు చేసింది. అతనితో మంచి స్నేహం కూడా ఉంది.
గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమెని దుల్కర్ సాల్మన్ రెండవ పెళ్లి చేసుకుంటానని ఆటపట్టించేవాడట నిజమేనా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి నిత్యామీనన్ సమాధానం చెప్తూ ‘మా మధ్య అలాంటి ఫన్నీ చిట్ చాట్స్ చాలానే ఉంటాయి. ఊరికే సరదాకి నన్ను పెళ్లి చేసుకుంటా అనేవాడు. కానీ నాకు వయస్సు వచ్చేసేలోపు ఎవరినైనా పెళ్లి చేసుకో అని గట్టిగా వత్తిడి చేసేవాడు. నాకు పెళ్లి మీద అంత ఆసక్తి లేదు, ఎదో ఒకరోజు చేసుకుంటానులే అని చెప్పాను’ అంటూ నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.