మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకుల వార్తలు ఎట్టకేలకు నిజం అని తేలింది. మూడేళ్ల క్రితం చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గత కొన్ని నెలలుగా వీరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి విడివిడిగా ఉంటున్నట్లు, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై ఇటు మెగా కుటుంబం గానీ అటు చైతన్య కుటుంబం గానీ వార్తలపై స్పందించలేదు. ఈ ఏడాది నిహారిక, చైతన్య తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో వీరు విడాకులు తీసుకుంటున్నట్లు కన్ఫర్మ్ అయింది. కానీ ఇప్పటివరకు అది అధికారికంగా కన్ఫామ్ కాకపోవడంతో విభేదాలు మాత్రమే వచ్చాయని అందరూ అనుకున్నారు.
తాజాగా మంగళవారం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఈ విడాకులపై నిహారిక స్పందించింది. తాను చైతన్య మ్యూచువల్ గా విడిపోతున్నామని తెలిపింది. “చైతన్య నేను మ్యూచువల్ గా విడిపోదామని నిర్ణయించుకున్నాం.. దయచేసి ఇలాంటి సున్నితమైన సమయంలో మమ్మల్ని ఒంటరిగా వదిలేయాలని కోరుకుంటున్నాం.

మేమిద్దరం ఇకపై కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుకుంటున్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉన్న కుటుంబానికి సన్నిహితులకు అభిమానులకు నా కృతజ్ఞతలు” అని ఇన్ స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది.