Nani : 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2021కు గాను పురస్కరాలను వెల్లడించింది. తెలుగు చిత్రాలకు ఏకంగా 10 జాతీయ అవార్డులు వచ్చాయి. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍కు లభించింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆరు జాతీయ పురస్కారాలు దక్కాయి. ఇక, నేషనల్ అవార్డులు గెలుచుకున్న వారికి టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని అభినందనలు తెలిపారు.

అయితే, ‘జై భీమ్’ సినిమాకు ఏ విభాగంలోనూ అవార్డు రాకపోవటంతో నిరాశ చెందాననేలా సంకేతం ఇచ్చారు. “జాతీయ అవార్డులు గెలిచిన వారందరికీ అభినందనలు. అన్ని అర్హతలు ఉన్న తెలుగు సినిమా సత్తాచాటింది. ఆర్ఆర్ఆర్, పుష్ప, ఉప్పెన టీమ్‍లతో పాటు తెలుగు సినిమా నుంచి, ఇతర సినీ ఇండస్ట్రీల నుంచి జాతీయ అవార్డులు దక్కించుకున్న వారందరికీ కాంగ్రాచులేషన్స్. తెలుగు సినిమా నుంచి తొలిసారి ఉత్తమ జాతీయ నటుడి అవార్డును బన్నీ (అల్లు అర్జున్) గెలుచుకోవడం మరింత ప్రత్యేకం” అని నాని ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు.

ఇదే క్రమంలో జై భీమ్ గురించి కూడా పేర్కొన్నారు. జైభీమ్ అని టైప్ చేసి పక్కన బద్దలైన హార్ట్ ఎమోజీని ఉంచారు నాని. అంటే జైభీమ్ చిత్రానికి ఒక్క జాతీయ అవార్డు కూడా రానందుకు నాని హర్ట్ అయినట్టు సంకేతాలు ఇచ్చారు. సూర్య హీరోగా నటించిన ‘జైభీమ్’ సినిమాపై తనకు ఉన్న ఇష్టాన్ని నాని గతంలో కొన్నిసార్లు చెప్పారు. రవితేజతో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కూడా ఆ సినిమా ప్రస్తావన తెచ్చారు.