Dasara Review : ఇటీవల కాలం లో భారీ అంచనాల నడుమ విడుదలైన కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ.సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.మధ్యలో ధనుష్ ‘సార్’ మరియు ‘బలగం’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చినా టాలీవుడ్ ఇండస్ట్రీ ని మరో లెవెల్ కి తీసుకెళ్లే కమర్షియల్ మూవీ మాత్రం రాలేదు.అలాంటి సమయం లో అందరి చూపులు న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ మూవీ మీదనే ఉన్నాయి.అందుకు తగ్గట్టుగానే టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా అన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అమెరికా నుండి అనకాపల్లి వరకు అదిరిపోయాయి.అలా అన్నీ విధాలుగా పాజిటివ్ వైబ్రేషన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా నేడు ఘనంగా విడుదలైంది.ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యిందో లేదో ఒకసారి ఈ రివ్యూ చూసి తెలుసుకుందాము.

కథ :
సింగరేణి బొగ్గు కర్మాగారం లో పని చేసే ధరణి ( నాని) తన స్నేహితుడు సూరి( దీక్షిత్ శెట్టి) తో కలిసి బిందాస్ గా జీవితం గడుపుతూ ఉంటాడు.కొట్లాటలకు కానీ, సంబరాలకు ఇద్దరు కలిసి వెళ్లాల్సిందే.అలా రొటీన్ గా గడిచిపోతున్న వీళ్ళ జీవితాల్లోకి వెన్నెల ( కీర్తి సురేష్) వస్తుంది.ఆమెని చూడగానే ఇద్దరూ ప్రేమలో పడిపోతారు, కానీ వెన్నెల మాత్రం సూరి నే ఇష్టపడుతుంది.వెన్నెల ని ఎంతగానో ప్రేమించి, ఆమెతో జీవితాన్ని ఊహించుకున్న ధరణి , వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం తెలుసుకొని ఎంతగానో మనస్తాపానికి గురి అవుతాడు.అయితే స్నేహితుడి కోసం చివరికి తన ప్రేమని త్యాగం చెయ్యడానికే సిద్ధం అవుతాడు.కానీ ఇంతలోపే తన స్నేహితుడు సూరి ని విలన్స్ చంపేస్తారు, ఎందుకు అతనిని చంపేశారు..?, సూరి వాళ్లపై పగ ఎలా తీర్చుకున్నాడు అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ :
సినిమా ప్రారంభం నుండే డైరెక్టర్ కథలోకి తీసుకెళ్ళిపోతాడు,చాలా ఇంటెన్స్ తో ముందుకు దూసుకెళ్ళిపోతున్న సినిమాలో ప్రారంభం 30 నిమిషాల వ్యవధి లోనే రెండు పాటలు వస్తాయి.స్టోరీ రొటీన్ అయ్యినప్పటికీ కూడా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల టేకింగ్ అద్భుతం అనే చెప్పాలి.చాలా సన్నివేశాలకు మనకి తెలియకుండానే ఈలలు చప్పట్లు కొట్టేస్తాం.అంత బాగా తీశాడాయన.ఇక న్యాచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది,ఇన్ని రోజులు ఆయనని కేవలం యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ లోనే చూసాము,అలాంటిది ఇలాంటి ఊర మాస్ సబ్జక్ట్స్ ని నాని మొయ్యగలడా అని అందరూ అనుకున్నారు.కానీ నాని నటన ప్రారంభ సన్నివేశం నుండే ఆడియన్స్ కి మైండ్ అయ్యే విధంగా చేస్తుంది.ఆయన మాట్లాడే యాస , బాడీ లాంగ్వేజ్ , ఎక్స్ప్రెషన్స్ మరియు ఎమోషన్స్ ఇలా అన్నీ అద్భుతంగా చేసాడు.

కీర్తి సురేష్ కి కూడా ఈ సినిమా తన కెరీర్ బెస్ట్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు,అంత గొప్పగా నటించింది. ఇక నాని స్నేహితుడిగా నటించిన దీక్షిత్ శెట్టి కి కూడా మంచి భవిష్యత్తు ఉందనే చెప్పాలి.చాలా సన్నివేశాల్లో ఆయన హీరో నాని కి నటనలో గట్టి పోటీ ఇచ్చాడు. మిగిలిన నటీనటులు కూడా అద్భుతంగా చేసారు.ఇక సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. పాటలు ఎంత అద్భుతంగా ఇచ్చాడో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఇచ్చాడు. చాలా సన్నివేశాల్లో ఈయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఆయువు పట్టులాగా నిల్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే ఆడియన్స్ కి సూపర్ హిట్ అనే విషయం అయిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ బోనస్ అనే ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంత చక్కగా తీసాడో , సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్ తీసాడు.కొన్ని కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.
చివరి మాట:
ప్రీ రిలీజ్ లో నాని చెప్పినట్టుగానే ఈ సినిమా టాలీవుడ్ కి మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ కంటెంట్. కచ్చితంగా థియేట్రికల్ అనుభూతి పొందాల్సిన సినిమా, మిస్ అవ్వకండి:
నటీనటులు : నాని , కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్ర ఖని, సాయి కుమార్
డైరెక్టర్ : శ్రీకాంత్ ఓదెల
సంగీతం : సంతోష్ నారాయణ్
బ్యానర్ : స్టార్ స్టూడియోస్ , AA ఫిలిమ్స్
రేటింగ్ : 3/5