Nagarjuna : టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ది ఘోస్ట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. నేడు ఆయన 64వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 64 ఏళ్ల వయసు వచ్చినా తరగని అందంతో కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నారు నాగార్జున. తన బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సినిమా ఫస్ట్ లుక్ తో పాటు మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు నాగ్ 98 సినిమాలు చేశారు. సెంచరీకి మరో రెండడుగుల దూరంలో ఉన్నారు. ప్రస్తుతం నాగ్ 99వ సినిమాకు ‘నా సామిరంగ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ గ్లింప్స్ లో మన్మథుడు మాస్ లుక్ లో మస్త్ గా ఉన్నారు.

గ్లింప్స్ విషయానికి వస్తే స్టార్ట్ కాగానే విలన్, నాగ్‌ను చంపేందుకు రౌడీల గుంపుతో కలిసి ప్లాన్ చేస్తాడు. ఏకంగా 56 మంది రౌడీలు అక్కడ గుమికూడుతారు. ఈ పండక్కి పని అయిపోవాలంటాడు విలన్. ఈ సమయంలోనే మరో వాడు.. వాడి కాలు తీసేయాలా? లేదా ఏకంగా వాడి తలే తీసేయాలా అని అడుతారు. ఇంతకీ ఎవడిని వేసేయాలో చెప్పమనగానే కింగ్ అంటాడు విలన్. ఆ మాట వినగానే రౌడీలకు చెమటలు పడతాయి. హీరో విలన్ల గుంపులోనే ఉండి నవ్వుతూ ముఖం మీద కర్చీఫ్ స్టైల్ గా తీసేస్తాడు. ఈ లోగా బయట ఉన్న వాళ్లు లోపల ఉన్నది పులులు కాదురా, మేకలు అంటారు. లోపల నాగ్ ఆ రౌడీలను బాదేస్తాడు. ఫైట్లో పగిలిన బల్డ్ ఫిలమెంట్ తో బీడీ కాల్చుకుంటూ రఫ్ లుక్ తో కింగ్ దర్శనమిస్తాడు. దాంతో పాటు ఈసారి పండక్కి ‘నా సామిరంగ’ అంటూ డైలాగ్ చెప్పేస్తారు హీరో.

‘పొరింజు మరియం జోస్’ అనే మలయాళ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఆ కథలో ఎలాంటి మార్పులు చేయకుండా తెలుగు నేటివిటీకి తగినట్లుగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. సినిమాలో హీరోకు సమానంగా విలన్ కు ప్రాధాన్యత కల్పించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ‘పలాస’ సినిమా దర్శకుడు కరుణకుమార్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. లుక్ పరంగా కరుణ కుమార్ బాగా సెట్ అయ్యాడు. ఈ సినిమా మాత్రమే కాకుండా ఆయన వరుణ్ తో ‘మట్కా’ అనే సినిమా చేయబోతున్నారు. ‘నా సామిరంగ’ సినిమాకు ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా ఓకే అయినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.