హీరో నాగచైతన్యకు కార్లు, బైక్‌లపై ఎంతో ఆసక్తి ఉందని ఆయన పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రేసింగ్ గేమ్స్‌లో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్‌లు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మోటర్ రేసింగ్ గేమ్‌లో నాగచైతన్య భాగమయ్యారు. హైదరాబాద్ బ్లాక్‌బర్ట్స్ రేసింగ్ టీమ్‌ను ఆయన కొనుగోలు చేశారు.

ఈ టీమ్‌కు అఖిల్ రవీంద్ర, నీల్ జానీ డ్రైవర్లుగా కొనసాగనున్నారు. ఈ టీమ్‌ను కొనుగోలు చేయడం పై నాగచైతన్య మాట్లాడుతూ తన కల తీరిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. మోటర్ స్పోర్ట్స్‌లో భాగం కావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బ్లాక్‌బర్ట్స్ టీమ్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ రేస్‌లు గొప్ప వినోదాన్నిస్తాయన్నారు. ఇక ఈ ఏడాది జరగనున్న ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో నాగచైతన్య టీమ్ పోటీ చేయనుంది. ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే ఇటీవల ‘కస్టడీ’తో పలకరించారు.

త్వరలోనే చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. 2018లో గుజరాత్ వెరావల్ నుండి వేటకు వెళ్లి పాక్ కోస్ట్ గార్డ్‌కు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరి జీవిత నేపథ్యంలో ఇది తెరకెక్కనుంది. మత్స్యకారుల వలసలు, పాక్‌కు చిక్కడం, అక్కడి నుంచి భారత్‌కు రావడం వంటివి ఇందులో చూపనున్నారు. దీని రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానునట్లు సమాచారం.