My Dear Donga Review : ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకుని గతకొన్ని రోజులుగా కొన్ని ఓటీటీ సంస్థలు ప్రత్యేకంగా సినిమాలు, సిరీస్‌లు రూపొందిస్తున్నాయి. తెలుగులో ఏకైక ఓటీటీ అయిన ఆహా కూడా ఇటీవల పలు సినిమాలు ప్రత్యేకంగా రూపొందిస్తోంది. ఆ జాబితాలోనే ‘మై డియర్ దొంగ’ అనే చిత్రం విడుదలైంది. అభినవ్ గోమఠం, షాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎలా ఉందంటే?
ఆ దొంగ స్టోరీ ఇదే ?: ఓ సుజాత (షాలిని), డాక్టర్ విశాల్ (నిఖిల్ గాజుల) లవర్స్. సుజాత డేటింగ్ యాప్‌నకు కాపీ రైటర్‌గా పనిచేస్తుంది. మొదట్లో ఈ ఇద్దరి రిలేషన్ బాగానే ఉన్నా.. కొంత కాలం తర్వాత విశాల్ మారిపోయాడని సుజాతకు అనిపిస్తుంది. తను ఎక్కడికి పిలిచినా రాకుండా బిజీ అని చెబుతుంటాడని తెగ ఫీలవుతుంది సుజాత. ఈ క్రమంలోనే సురేశ్ (అభినవ్ గోమఠం) ఆమె ఫ్లాట్‌లో చోరీ చేసేందుకు వెళ్లగా.. అదే సమయానికి షాలిని బర్త్‌డే సెల్రబేషన్ చేసేందుకు స్నేహితులు బుజ్జి (దివ్య శ్రీపాద), వరుణ్ (శశాంక్ మండూరి), విశాల్ ఆమె ఇంటి వస్తారు. సురేశ్‌ను సుజాత.. తన చిన్ననాటి స్నేహితుడిగా వారికి పరిచయం చేస్తుంది.. దొంగ అని తెలిసినా సుజాత.. సురేశ్‌తో ఎందుకు పరిచయం పెంచుకుంది? విశాల్ పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి కారణమేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
దొంగ దొరికాడా లేదా? : ఓ హీరోయిన్.. ఇద్దరు హీరోలు.. ప్రేమ.. చివరికి ఎవరో ఒకరు ఫీలవడం. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఇప్పటికే చాలా వచ్చాయి. ఈ మూవీ కూడా ఆ ఫార్మాట్‌లో సాగే స్టోరీనే కానీ, కామెడీ ప్రధానంగా తీయడంతో కాస్త ఆసక్తికరంగా నిపించింది. దాదాపుగా సినిమా మొత్తం నవ్వులు పూయిస్తుంది. అసలు ఈ స్టోరీ సుజాతది. ఆమె ప్రేమ కథలను నేరుగా చెప్పకుండా.. ఓ హోటల్‌లో వెయిటర్‌కు సుజాత తన బ్యాక్ స్టోరీలను తానే వివరించడం ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమా కథను తానే స్వయంగా రాయడం విశేషం. సినిమా స్టార్టింగ్‌లో స్లోగా అనిపించినా.. సుజాత ఫ్లాట్‌లోకి సురేశ్ వచ్చిన తర్వాత కాస్త వేగం పుంజుకుంటుంది. కామెడీలో కన్ఫ్యూజన్ ట్రిక్ ఎప్పుడూ నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాకు కూడా అదే హైలైట్. సురేశ్ గురించి అసలు విషయం తెలుసుకున్న విశాల్ ఏం చేశాడనేది సెకండాఫ్‌లో ప్రధానాంశం. ప్రీ క్లైమాక్స్ సీన్స్‌ను ఎమోషనల్‌గా రూపొందించినా క్లైమాక్స్‌ను కామెడీ ట్రాక్‌లోనే పెట్టారు.
దొంగ ఎలా నటించాడంటే ? : అభినవ్ తనదైన మార్క్ హావభావాలతో అలరించారు. సుజాతగా షాలిని ఒదిగిపోయారు. కొన్ని సీన్స్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ సూపర్. ఎప్పటిలానే అభినవ్ తన కామెడీతో గిలిగింతలు పెట్టారు. నేటి ప్రేమికుల మనస్తత్వం ఎలా ఉందో తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు షాలిని. ఆమె రాసిన కథను అంతే చక్కగా తెరపైకి తీసుకొచ్చారు సర్వజ్ఞ కుమార్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తాయి.
ఇవే దొంగ ప్లస్ పాయింట్స్:
- శాలిని, అభినవ్ గోమఠం నటన
కామెడీ - ఈ దొంగకు మైనస్ పాయింట్స్ ఉన్నాయండోయ్ :
– అక్కడక్కడా స్లో నెరేషన్
చిత్రం: మై డియర్ దొంగ
నటీనటులు : అభినవ్ గోమఠం, షాలిని కొండెపూడి, నిఖిల్ గాజుల, దివ్య శ్రీపాద, శశాంక్ మండూరి, వంశీధర్ గౌడ్
రచన : శాలిని కొండెపూడి
దర్శకత్వం : బి.ఎస్. సర్వజ్ఞ కుమార్
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : ఆహా
రేటింగ్ : 2.5/5
కన్‌క్లూజన్ : ఈ ‘దొంగ’.. కామెడీతో ప్రేక్షకుల మనసు దోచేశాడు.