Mrunal Thakur : ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇటీవలే ‘మేడ్ ఇన్ హెవెన్ 2’లో కనిపించి అలరించారు. ప్రస్తుతం 5 సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో మూడు బాలీవుడ్ చిత్రాలు కాగా.. రెండు తెలుగు సినిమాలు. నాని సరసన మృణాల్ నటిస్తోన్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే విజయ్ దేవరకొండ పరశురామ్ సినిమాలో మృణాల్ నటించనున్నారుతాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలుగు ప్రేక్షకులు తనను ఎంతో ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
వివాహ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్న మృణాల్.. మన మనస్తత్వానికి సరిపోయే వ్యక్తి కనిపిస్తే వారిని వివాహం చేసుకోవచ్చని చెప్పారు. ‘‘మా కుంటుంబంలో, బంధువుల్లో చాలామంది వివాహానంతరం సంతోషంగా ఉన్నారు. వారంతా ఒకరికోసం ఒకరు పుట్టారా అన్నట్లు ఉంటారు. మన మనస్తత్వానికి సరిపోయే వ్యక్తి కనిపిస్తే వారిని వివాహం చేసుకోవడానికి వయసుతో పనిలేదని నా అభిప్రాయం. 18నుంచి 60 ఏళ్ల వరకు ఎప్పుడైనా అలాంటి వారు మనకు తారస పడొచ్చు. అలాంటి వ్యక్తి కనిపిస్తే పెళ్లి చేసుకోండి..’’ అని చెప్పుకొచ్చారు.
ఇక తాను నటించిన మూవీల గురించి మాట్లాడుతూ..‘‘సినిమాల విజయానికి నిర్వచనం నాకు తెలీదు. నేను చేసిన పలు చిత్రాలు రూ.100కోట్ల క్లబ్‌లో చేరాయి. మరికొన్ని మంచి గుర్తింపు పొందాయి. తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపుతున్నారు. నన్ను తెలుగు అమ్మాయిగా అంగీకరించారు. వాళ్లంతా నన్ను వారి కుటుంబంలోని వ్యక్తిగా భావిస్తారు. ఈ విషయం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ఇక ‘సీతారామం’ సినిమాతో ప్రేక్షకుల నుంచి నేను అమితమైన ప్రేమను పొందా’’ అంటూ తనను ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.