మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే భోళా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ భోళా శంకర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే మెగాస్టార్ చిరంజీవి మోకాళ్ళ సర్జరీ చేయించుకోబోతున్నారని వార్తలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో ఆయన అమెరికా వెళ్ళింది కూడా అందుకేనన్న ప్రచారం జరిగింది.

కానీ అమెరికా నుంచి ఇండియా కూడా వచ్చేశారు, అయినా ఆయన మోకాళ్ళ సర్జరీ జరగకపోవడంతో ఈ వార్తలు పుకార్లేమో అనుకున్నారు. కానీ ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి మోకాలి నొప్పికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. న్యూఢిల్లీలో ఆర్థోస్కోపి నీ వాష్ ట్రీట్మెంట్ చిరంజీవి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో ఆయన వారం రోజులు పాటు రెస్ట్ తీసుకోబోతున్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ తిరిగి రాబోతున్నారు. ఈనెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన హైదరాబాద్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.

ఆరోజు చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవం జరగబోతుందని చెబుతున్నారు. ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహారించనున్నారు. గతంలో బంగార్రాజు, సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కూడా ఒక రీమేక్ సినిమా అనే ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజం కాదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది సినిమా రిలీజ్ అయితే గాని చెప్పలేం.