Megastar Chiranjeevi తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు అయితే, మూడవ కన్ను మెగాస్టార్ చిరంజీవి. మన సినిమా ఇండస్ట్రీ ని చిరంజీవి శకానికి ముందు, ఆ తర్వాత గా విభజించవచ్చు. అప్పటి వరకు ఒక మూసలో వెళ్తున్న కమర్షియల్ సినిమా స్థితి గతులను మార్చిన లెజెండ్ ఆయన. చిరంజీవి వచ్చిన తర్వాతనే డ్యాన్స్ లో , ఫైట్స్ లో వేగం పెరిగింది.

ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పోటీ పడేందుకు ఇతర స్టార్ హీరోలు కూడా ఆరాటపడేవాళ్లు. ఆమ్మో చిరంజీవి టైం ప్రారంభం అయ్యింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ఇండస్ట్రీ లో నాటుకుపోతాడు అనే భయం అప్పటి సూపర్ స్టార్స్ లో కూడా కలిగి డ్యాన్స్, ఫైట్స్ లలో వేగం పెంచేవారు. అది మెగాస్టార్ చిరంజీవి అంటే. ఆయన శకం ప్రారంభం అయిన రోజు నుండి వరకు నాలుగు తరాల ప్రేక్షకులు చిరంజీవి మేనియా ని చూసారు.

40 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీ కి వచ్చిన ఒక్క హీరో ఇప్పటికీ నెంబర్ 1 స్థానం లో కొనసాగడం, తనకి పోటీ ఎవ్వరూ లేరు అనిపించుకోవడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎక్కడా జరగలేదు. సేవ కార్యక్రమాల్లో కూడా చిరంజీవి కి పోటీని ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. తానుమాత్రమే సహాయం చెయ్యకుండా, తనని అభిమానించే వారిని కూడా సేవ మార్గం లోకి నడిచేలా చేసిన ఘనుడు ఆయన. అలాంటి లెజెండ్ కి కాకుండా ఇక ఎవరికీ ఇస్తారు ‘పద్మవిభూషణ్’ అవార్డు.

నిన్న ఆయనకి ఈ పురస్కారం దక్కినప్పుడు వెలువడిన శుభాకాంక్షల వెల్లువని చూస్తూ ఉంటే చిరంజీవి స్థాయి ఎలాంటిదో నేటి తరం ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. వాస్తవానికి ఆయనకి పదేళ్ల క్రితమే ఈ పద్మవిభూషణ్ అవార్డు రావాల్సి ఉంది. కానీ కొన్ని కుట్ర రాజకీయాల వల్ల చిరంజీవికి ఒక పదేళ్లు ఆలస్యంగా వచ్చింది. దేశం లోని రెండవ అత్యున్నత పురస్కారం అయిన ఈ ‘పద్మవిభూషణ్’ అవార్డు చిరంజీవి కి దక్కడం మన తెలుగు సినిమాకి గర్వకారణం.
