Raviteja : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోమంటారు పెద్దలు.. ఇదే సామెతను ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులు పాటిస్తుంటారు. వాళ్లు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్ లో కూడా అడుగుపెట్టి రాణిస్తూ ఉంటారు. కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారంలో రాణిస్తుంటే.. మరి కొంతమంది తమకు ఆసక్తి ఉన్న వేరే వేరే బిజినెస్ లలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటూ ఉన్నారు. అలా ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్ నిర్మాణరంగంలో అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ ను స్థాపించి దానిని అద్భుతంగా రన్ చేస్తున్నారు.
మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఏఏఏ సినిమాస్ అంటూ కొత్త మల్టీప్లెక్స్ ను స్టార్ట్ చేశారు. గత ఏడాది ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్‌కు జనాలలో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు వారిద్దరి బాటలో ఇప్పుడు టాలీవుడ్ మాస్ మహారాజ్ పయనించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ స్టార్ హీరోలకు పోటీగా రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలు పెడుతున్నాడు. తాజాగా అందిన సమాచారం మేరకు రవితేజ.. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్లు సమాచారం.
ఈ మల్టీప్లెక్స్ కి ఏఆర్‌టి అనే పేరుతో ఫిక్స్ చేశారట. అలాగే ఆరు స్క్రీన్స్ మల్టీప్లెక్స్‌గా దీనిని నిర్మించనునట్లు తెలుస్తోంది. ఇటీవల రవితేజ వరుస సినిమాలు చేసిన ఆశించిన ఫలితాలు మాత్రం అందడం లేదు. ధమాకా తర్వాత రవితేజ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఇటీవల రిలీజైన ఈగిల్ కూడా రవితేజను నిరాశపరిచింది. దీంతో రవితేజ బిజినెస్ లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు అని తెలియడంతో ఆయన అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.